● రూ.50 లక్షల సరుకు అగ్నికి ఆహుతి
నందలూరు: నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి రైల్వే గేటు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జయలక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ ఫాన్సీ స్టోర్లో మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.50 లక్షల పైగా విలువైన సరుకు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దుకాణంలో మంటలు చెలరేగడాన్ని ఇంటి యజమాని గెలివి జయలక్ష్మి, గెలివి నాగేంద్ర గుర్తించి బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజంపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు ఆర్పడం సాధ్యం కాలేదు. ఫైర్ ఇంజన్‌లోని నీరు పూర్తిగా అయిపోవడంతో మరోసారి నీటిని నింపేందుకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో మంటలు మరింతగా చెలరేగడంతో దుకాణంలోని సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితులు వాపోయారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు అదనపు ఫైర్ ఇంజన్ కోసం అగ్నిమాపక అధికారులను కోరారు. అయితే రాజంపేటలో ఒక్క ఫైర్ ఇంజన్ మాత్రమే ఉందని, కడప నుంచి మరో వాహనం రావాలంటే సమయం పడుతుందని అధికారులు తెలిపినట్లు బాధితులు పేర్కొన్నారు. సకాలంలో అదనపు అగ్నిమాపక వాహనం అందుబాటులోకి వచ్చి ఉంటే నష్టం కొంతవరకు తగ్గేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే దుకాణంలోని సరుకంతా మంటల్లో కాలిపోవడంతో బాధితులు బోరున విలపించారు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.


