సిఫారసులు, డబ్బులతో మళ్లీ కోర్టు డ్యూటీలకే..
● వారెంట్ల పేరుతో నిందితులు,
బాధితుల నుంచి దందా
● జరిమానా రూ.200–రూ.500.. వసూళ్లు రూ.3వేలు – 5 వేలు
● క్రిమినల్ కేసుల్లో పిండి పిప్పి చేస్తారు
● రాజీల పేరిట బాధితులపై ఒత్తిడి
బద్వేలు: వైఎస్‌ఆర్ కడప జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు కోర్టు డ్యూటీలు కాసులు కురిపిస్తున్నాయి. మాటల మాంత్రికులైన కొందరు కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు వారెంట్ల పేరుతో నిందితులను, బాధితులను ఇద్దరినీ వేర్వేరుగా కలుస్తూ భయాందోళనకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల అమాయకత్వం, బలహీనతలే పెట్టుబడిగా, నిందితుల భయాందోళనలే ఆదాయ మార్గంగా కోర్టు కానిస్టేబుళ్లు ఈ వసూళ్ల దందాకు తెరలేపారు.
అసలు విధులు ఇవీ..
కానీ జేబులు నిండేది ఇలా..
జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో ప్రతి పోలీసు స్టేషన్‌కు కోర్టు కేసుల నిమిత్తం ఒకరిద్దరు కానిస్టేబుళ్లతో పాటు వారెంట్ సిబ్బంది ఉంటారు. కేసుల వివరాలను కోర్టుకు అప్పగించడం, చార్జ్ షీట్లను చేర్చడం, వాయిదాలను నోట్ చేసుకోవడం, కోర్టు ఆదేశాలను స్టేషన్ అధికారికి తెలియజేయడం, చిన్న కేసుల్లో జరిమానాలు కట్టించడం, పీటీ వారెంట్లలో నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం వీరి ప్రధాన విధులు. ఎటువంటి సమస్యలేని ఈ విధులే ఇప్పుడు కోర్టు కానిస్టేబుళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. బాధితులైనా, నిందితులైనా సరే కోర్టుకు హాజరయ్యారంటే కానిస్టేబుళ్ల చేతిలో డబ్బులు పెట్టక తప్పడం లేదు. ప్రతి రోజూ ఒక్కో పోలీసు స్టేషన్ నుంచి కోర్టు సిబ్బంది వేలల్లో జేబులు నింపుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది.
చేయి తడపకపోతే
సాయంత్రం దాకా పడిగాపులే!
జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేసే కానిస్టేబుళ్లు చిన్న చిన్న నేరాలకు నిందితుల నుంచి జరిమానాలు కట్టించాల్సి ఉంటుంది. చిన్న నేరాలకు కోర్టులో కట్టే జరిమానాలు రూ.200 నుంచి రూ.500 మాత్రమే కాగా.. కోర్టు ఖర్చులంటూ నిందితులు, బాధితుల నుంచి రూ.3 వేల నుండి రూ.5 వేల వరకూ వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాయిదా రోజు సంబంధిత కోర్టు కానిస్టేబుల్‌ను పట్టించుకోకపోతే సాయంత్రం వరకూ కోర్టు వద్ద పడిగాపులు కాయాల్సిందేనని కక్షిదారులు వాపోతున్నారు. అదే కోర్టుకు హాజరైన వెంటనే కానిస్టేబుల్ చేయి తడపగలిగితే.. వెంటనే వాయిదా వేయించి క్షణాల్లో ఇంటికి పంపిస్తారని బాధితులు చెబుతున్నారు.
పెద్ద కేసుల్లో రాజీపడాలని బాధితులపై ఒత్తిడి
రోడ్డు ప్రమాదాలు, భూతగాదాలు, గొడవలు తదితర పెద్ద కేసుల్లో న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులపై రాజీపడాలంటూ ఒత్తిడికి గురిచేస్తున్నారు. రాజీపడితే ఎంతో కొంత సొమ్ము వస్తుందని, కేసులు పెడితే డబ్బున్న వారితో కోర్టుల చుట్టూ నడపలేరని నయానా భయానా బెదిరిస్తూ పెద్దల దగ్గర అందినకాడికి గుంజుకుంటున్నారు. దీంతో నిజమైన బాధితులు నష్టపోతున్నారు. ఈ కేసుల్లో బాధితుల పక్షాన ఉండే ప్రభుత్వ న్యాయవాదికి, నిందితుల పక్షాన ఉండే ప్రైవేటు వకీళ్లకు ఈ కోర్టు కానిస్టేబుళ్లే మధ్యవర్తులుగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
కోర్టు డ్యూటీలో రాటుతేలిన కానిస్టేబుళ్లు చిన్నపాటి పెట్టీ కేసుల నుంచి నాన్ బెయిలబుల్ కేసుల దాకా.. తాము విధులు నిర్వహించే పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకూ చక్రం తిప్పుతున్నారు. నిత్యమూ అక్రమార్జనతో వేలు, లక్షలు సంపాదిస్తూ ఇంద్రభవనం లాంటి ఇళ్లు నిర్మించుకుని దర్జాగా బతికేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే పోలీసు స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహించడంతో వీరి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఒకవేళ వీరు ఇతర చోట్లకు బదిలీ అయినా.. అక్కడ కూడా కోర్టు విధులకే మొగ్గు చూపుతూ, సిఫారసులు, డబ్బులతో సంబంధిత అధికారుల చేతులు తడిపి మళ్లీ అదే పోస్టింగ్ వేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఏదో విధంగా స్టేషన్లలో కేసులు తగ్గితే చాలన్నట్లు వ్యవహరిస్తూ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా పోలీసులు బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


