ప్రొద్దుటూరు క్రైం : చర్మంపై చిన్న పొడ కనిపించింది.. నొప్పి లేదు.. దురద కూడా లేదు.. ఏదో సాధారణ చర్మ సమస్య అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నారా ? అయితే జాగ్రత్త! ఆ పొడపై స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే అంది కుష్టు వ్యాధికి సంకేతం కావచ్చు. తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. చికిత్సలో జాప్యం చేస్తే నరాలు దెబ్బతిని చేతులు, కాళ్లలో అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో కుష్టవ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది.కడప జిల్లాలో గత ఐదేళ్లలో 355 మంది కుష్టు వ్యాధి బాధితులకు పూర్తి స్థాయి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. వీరు చికిత్స అనంతరం వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 63 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారు. ప్రొద్దుటూరు లెప్రసీ విభాగం పరిధిలోని ప్రొద్దుటూరు అర్బన్, రాజుపాళెం, కల్లూరు, కామనూరు పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీపీఎంఓ శివశంకరయ్య తెలిపారు.
ఎల్సీడీసీ సర్వేను విజయవంతం చేయాలి
కడప రూరల్ : ఈనెల 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ఎల్సీడీసీ (కుష్టు నియంత్రణ, అవగాహన) సర్వే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ యుగంధర్ కోరారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఈ సర్వేకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది నిర్దేశించిన వ్యవధిలో ఇంటింటి సర్వేను పూర్తి చేయాలన్నారు. వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి ఎక్కడా సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిబాబు, డాక్టర్ ఆరిఫుల్లా, ఏఓ విజయభాస్కర్, పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు ఇంటింటి సర్వే


