కడప అగ్రికల్చర్: రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేని కారణంగా వ్యవసాయం రంగం కుదేలైందని, రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక కరువు సహాయ ప్రాకేజీని ప్రకటించి రైతులను అదుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ చాంబర్‌లో వైస్ చైర్మన్ పిట్టు బాలయ్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ మాధవ్‌రెడ్డి, చెన్నూరు ఎంపీపీ సురేష్‌యాదవ్‌లతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ రైతును ఆదుకుంటేనే వ్యవసాయం నిలుస్తుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందన్నారు. రైతులకు పెట్టుబడి బాగా పెరిగిందని రాబడి మాత్రం పడిపోయి ఆర్థికంగా వెనకబడిపోతున్నారన్నారు. వ్యవసాయ ఎమర్జెనీ ప్రకటించి ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రతి ఎకరాకు తగిన కరువు పరిహారం చెల్లించాలన్నారు. పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సిడి, సున్నా వడ్డి బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర్ర సంవత్సరం అవుతున్నా రైతులకు పథకాలు మాత్రం రావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే 1866లో వచ్చిన డొక్కల కరువు గుర్తుకు వస్తుందని అన్నారు.


