కడప కార్పొరేషన్ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం తగదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు హీరామియ్యా, కార్యదర్శి చిన్న మస్తాన్ అన్నారు. ఆదివారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ 2 డీఏలు, పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో లక్షకు పైగా ఉన్న ఉద్యోగులకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం ఇంక్రిమెంట్ల మంజూరుపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లతోపాటు 9నెలల అరియెర్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలన్నారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హేమసుందర్ రాజు పాల్గొన్నారు.


