ఉద్యోగులను మోసగిస్తున్న కూటమి సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను మోసగిస్తున్న కూటమి సర్కార్‌

Sep 6 2026 1:25 AM | Updated on Sep 6 2026 1:25 AM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉద్యోగులను మోసగిస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం కడప నగరంలోని వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీఅమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చర్చలకు పిలిస్తే ఏదో చేస్తారని ఆశపడి వెళ్లారని, చివరికి రెండు డీఏలు, పోలీసులకు ఒక సరెండర్‌ లీవులు ఇచ్చి నిరాశే మిగిల్చారన్నారు.

] ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు డీఏలు పెండింగ్‌ ఉంటే రెండు ఇస్తారా అని ప్రశ్నించారు. దీనికి ఉద్యోగసంఘ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఆర్సీ కమిషన్‌, ఐఆర్‌ ఎక్కడని, సీపీఎస్‌ విషయంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు పెండింగు బకాయిలు ఉంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో లేదో సమాధానం చెప్పాలన్నారు.

గత ప్రభుత్వంలోనే ఉద్యోగులకు భరోసా

గత ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చిందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి గత ప్రభుత్వం జీతాలు పెంచిందని, కరోనా ఇబ్బంది వల్ల 23 శాతం ఫిట్‌మెంటు ఇస్తే రివర్స్‌ పీఆర్సీ అని చంద్రబాబు అంటున్నారన్నారు. మీకు చేతనైతే ఆ రివర్స్‌ పీఆర్సీ అయినా ఇవ్వండన్నారు. రెండున్నరేళ్లుగా ఐఆర్‌ లేకుండా ఉండటం ఎప్పుడూ జరగలేదని, ఈ రోజు ఐఆర్‌ లేదు, పీఆర్సీ లేదు, పింఛను స్కీమ్‌ కూడా లేదన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన చేయడం మొదలు పెడితే ఇక ప్రభుత్వం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు.

ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై ఆగ్రహం

కరోనా సమయంలో కేంద్రం డీఏలను ఫ్రీజ్‌ చేస్తే.. అది అయిపోగానే గత ప్రభుత్వం ఒక్కసారి ఐదు డీఏలు ఇచ్చిందన్నారు. ఇక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంపు తప్ప జీతాల పెంపు, ప్రమోషన్లు లేవన్నారు. వందలాది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉన్న టీచర్లను టెట్‌ రాయాలంటారు కానీ..వాళ్లు మాత్రం టెట్‌ లేకుండానే ఉద్యోగాలిస్తారని ఎద్దేవా చేశారు. టెట్‌ గురించి కేంద్ర మంత్రిని కలిస్తే వారిపై అబద్ధపు ప్రచారం చేసి సస్పెండ్‌ చేశారని, ఎంపికై న ఉద్యోగులతో ర్యాలీలు చేయిస్తూ తమ రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏమీ చేయదని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి వరదారెడ్డి, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు ఎస్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement