కాశినాయన : మండలంలోని ఇటుకలపాడు గ్రామానికి చెందిన కొప్పోలు సురేంద్రారెడ్డి (14) కారు ఢీకొని దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటుకలపాడు గ్రామానికి చెందిన కొప్పోలు శ్రీనివాసులరెడ్డి, లత దంపతుల రెండో కుమారుడు సురేంద్రారెడ్డి శుక్రవారం వాళ్ల పెద్దనాన్న బైక్ పంఛర్ కావడంతో తోచుకుంటూ తీసుకెళుతున్నాడు. పోరుమామిళ్ల నుంచి మైదుకూరుకు వెళ్లే కారు.. వెనుక నుంచి బైక్‌ను ఢీకొనడంతో సురేంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సురేంద్రారెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. కారు డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. చిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోరుమామిళ్ల సీఐ హేమసుందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాశినాయన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


