చింతకొమ్మదిన్నె : అనంతపురం–2 ఆర్‌ఇజెడ్ నుంచి కడప పవర్ గ్రిడ్ స్టేషన్ వరకు నిర్మాణం చేయతలపెట్టిన 765 కేవీ విద్యుత్ లైన్‌లను రైతుల భూముల్లో బలవంతంగా వేయనిచ్చే పరిస్థితి ఉండదని కడప ఆర్డీవో మురళి రైతులకు తెలియజేశారు. చింతకొమ్మదిన్నె మండల రైతులు రెజోనియా సంస్థ చేపడుతున్న 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఇదివరకే వివిధ సందర్భాల్లో కలెక్టరేట్, కడప ఆర్డీఓ, చింతకొమ్మదిన్నె తహసిల్దార్, పవర్ గ్రిడ్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం రెజోనియా సంస్థ చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని రైతుల భూముల్లో బలవంతంగా 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపట్టేందుకు పోలీసు రక్షణ కోరిన నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడం, ‘సాక్షి’లో వివరాలు బయటకి రావడంతో రైతుల అభ్యంతరాలు వినడానికి పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించారు.గురువారం చింతకొమ్మదిన్నె తహసిల్దార్ కార్యాలయంలో కడప ఆర్డీవో మురళి, డీఎస్పీ బాలస్వామిరెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి చింతకొమ్మదిన్నె మండలంలోని 765 కేవీ విద్యుత్ లైన్ ప్రభావిత 12 గ్రామాల రైతులను, రెజోనియా సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. రైతులు తాము ఏప్రిల్ 2025న పత్రికా ప్రకటనలో స్టెరిలైట్ సంస్థ విధించిన గడువులోగానే వారి కంపెనీ చూపిన అడ్రస్‌కు రిజిస్టర్ పోస్టులు చేస్తే వెనక్కి వచ్చాయని, మెయిల్, ప్రతినిధి ద్వారా స్టెరిలైట్ సంస్థకు అభ్యంతరాలను తెలుపుతూ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచించినట్లు తెలిపారు. పలువురు రైతులు మాట్లాడుతూ స్టెరిలైట్ సంస్థ రూపొందించిన డిజైన్‌లోని లోపాలను ఎత్తిచూపారు. దేవాలయాల సమీపం నుంచి సత్రాల మీదుగా,కొన్నిచోట్ల ఇళ్లమీదుగా, మరికొన్ని చోట్ల పాఠశాలలకు అత్యంత సమీపం నుంచి, విలువైన భూముల మీదుగా సాగే ప్రస్తుత 765 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణాన్ని తాము సహకరించబోమని తెగేసి చెప్పారు.
కొందరు రైతులు మాట్లాడుతూ కడప నగరానికి అత్యంత సమీపంలోని విలువైన భూముల గుండా దాదాపు 10 గ్రామాలకు ఆనుకుని వెళ్లే ఈ డిజైన్ లోపభూయిష్టంగా ఉందని రైతులు సూచించిన మేరకు సమీపంలోని గుట్టల మీదుగా విద్యుత్ లైన్ నిర్మాణం చేపట్టాలని అందుకు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు.
తాము ఇదివరలోనే పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను సంప్రదించి తమ బాధను ,అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి దాదాపు 150 కుటుంబాలు రోడ్డున పడే ప్రస్తుత డిజైన్ మార్గాన్ని మార్పించి సమీప గుట్టలమీదుగా వెళ్లే విధంగా మార్పు చేయించాలని రైతులు కోరారు. సమావేశానికి వచ్చిన రైతుల నుంచి వారి భూమి వివరాలను ఆర్డీఓ, తహసిల్దార్ సేకరించారు. అనంతరం ఆర్డీవో మురళి మాట్లాడుతూ రైతుల భూముల్లో బలవంతరంగా 765 కేవీ విద్యుత్ నిర్మాణం జరపరని,ఈనాటి సమావేశ వివరాలను, రైతుల అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. రెజోనియా సంస్థ ప్రతినిధి గిరిప్రసాద్ మాట్లాడుతూ తాము గతంలో స్టెరిలైట్ సంస్థ పేరుతో అనంతపురం నుంచి కడప పవర్ గ్రిడ్ స్టేషన్ వరకు 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణ కాంట్రాక్టు మార్చి 2025లో పొంది ఉన్నామన్నారు. సంబంధిత డిజైన్ మేరకు లైన్లు వెళ్లే రైతుల అభ్యంతరాల స్వీకరణకు గత ఏప్రిల్ 10వ తేదీన ఓ పత్రికలో పత్రికా ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు.అయితే నిర్ణీత గడువు 60 రోజుల లోపల కొందరు రైతులు రిజిస్టర్ పోస్టు ద్వారా అభ్యంతరాలు తెలిపి ఉన్నారని, తాము కార్యాలయం మార్చడం వల్ల అందుకోలేకపోయామన్నారు. అలాగే రైతులు మెయిల్ ద్వారా పంపిన సమాచారాన్ని తాము విశ్లేషించి తమ పరిధిలోనే తమకు డిజైన్ మార్పు చేయదగినవిగా అనిపించకపోవడంతో పరిశీలనలోకి తీసుకోలేదన్నారు.రైతుల అభ్యంతరాలు స్టెరిలైట్ సంస్థ సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చేరవేయలేకపోవడంతో,కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటే ప్రత్యామ్నాయ మార్గంగా చూపుతున్న మార్గంలో 9 టవర్లను క్రాస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రస్తుత డిజైన్ మార్గంలో కూడా15 టవర్లను క్రాస్ చేస్తున్నట్లు రైతుల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.చింతకొమ్మదిన్నె సీఐ బలమద్దిలేటి,ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి రైతులతో అధికారుల సమావేశాన్ని పోలీసు బందోబస్తు మధ్య సజావుగా సాగేలా చూశారు.
కొసమెరుపు : ప్రస్తుత డిజైన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే చేయకుండా కేవలం గూగుల్ మ్యాప్ ఆధారం చేసుకొని డిజైన్ తయారు చేసినట్లు రెజోనియా సంస్థ ప్రతినిధులు అధికారుల సమక్షంలో అంగీకరించారు. క్షేత్ర స్థాయిలో రైతుల వ్యతిరేకత ,గ్రామాల సమీపంలో వెలసిన నిర్మాణాలు,గడువులోగా రైతుల అభ్యంతరాలు తెలపడం,డిజైన్ లోపాలతో ఉండటం,ప్రత్యామ్నాయ మార్గానికి అటవీ అనుమతులు సాధించాల్సి ఉన్నందున ప్రతిష్టంభన నెలకొంది.
ఇదివరలోనే రైతులు తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని టెలిగ్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 10(డి) మేరకు రెజోనియా సంస్థను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి చెర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
మాయమాటలతో మోసపోయా
ఇప్పపెంట పరిధిలోని రైతు అజ్మత్‌బాష మాట్లాడుతూ తనకు మాయమాటలు చెప్పి తన అకౌంట్లో డబ్బులు వేశారని, తన భూమిలో ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్ ఫౌండేషన్ ఇదివరలోనే ధ్వంసమైనందున తాను వారు కోరిన అకౌంట్ కు డబ్బులు బదిలీ చేస్తానని,తన పొలంలో విద్యుత్ లైన్‌కు అంగీకరించడం లేదని అధికారులకు, రేజోనియా సంస్థ ప్రతినిధులకు తెలిపారు.
విద్యుత్ లైన్ల నిర్మాణం ఆపాలి
లక్కిరెడ్డిపల్లెకు చెందిన రైతు వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ తాను చిన్న వ్యవసాయ రైతునని, ఆ భూమిని నమ్ముకుని పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నాని చెప్పారు. ప్రస్తుత డిజైన్ మేరకు భూమిలో సగభాగానికి పైగా రైట్ ఆఫ్ వే కింద వెళ్లిపోతుందని, దీంతో భూమి విలువను కోల్పోయి రోడ్డున పడతామని,బలవంతంగా విద్యుత్ లైన్లు నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు.
765 కేవీ విద్యుత్ లైన్ వద్దు..
రైతుల అల్టిమేటం
అన్నదాతల అభ్యంతరాలను
ఉన్నతాధికారులకు నివేదిస్తాం:
కడప ఆర్డీవో మురళి


