ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో చాలాకాలంగా బోధన సిబ్బంది కొరత ఉంది. యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి శాశ్వత అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు విద్యాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ శాతం మంది కాంట్రాక్టు లేదా అతిథి అధ్యాపకులపై ఆధారపడటం వల్ల బోధనా ప్రమాణాలు తగ్గి, సబ్జెక్టులు అర్థం కాక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరంతరం మారే ఫ్యాకల్టీ కారణంగా విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు అందవు. దీనివల్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.


