● విద్యార్థులకు అందని చికెన్, కోడిగుడ్లు
● గత రెండేళ్లుగా ఎగ్గొట్టిన
ల్యాప్ టాప్స్, యూనిఫామ్‌లు
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో గత రెండేళ్లుగా సిబ్బంది కొరత, నిధుల కొరత, మౌలిక వసతుల లేమి, పౌష్టికాహారం అందించడంలో జాప్యం వంటి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు ప్రవేశాలు జరిపి ఈనెల 1 న తరగతులను ప్రారంభించారు. అయితే 17 రోజులు కావస్తున్నా విద్యార్థులకు పౌష్టికాహారమైన కోడిగుడ్డు, చికెన్ అందించడంలేదు. పప్పు, కూరలతో భోజనం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యనందించడంతోపాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2008లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి పౌష్టికాహారంలో భాగంగా వారానికి రెండు రోజులు చికెన్, నాలుగు రోజులు కోడిగుడ్లు పెడుతున్నారు.
అయితే వేసవి సెలవుల అనంతరం 17 రోజులు గడుస్తున్నా.. ఒక్కరోజు కూడా చికెన్, కోడిగుడ్డు పెట్టలేదు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 26,400మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విషయంపై పరిపాలన అధికారి రవికుమార్‌తో మాట్లాడగా వచ్చే వారంలోపు పెడతామని చెబుతున్నారే తప్ప.. కచ్చితంగా సమాధానం ఇవ్వడంలేదు. ప్రైవేట్ వ్యక్తులతో పెట్టించాలా లేక ఎవరికై నా బాధ్యతలు అప్పగించాలా అనే అంశం సైతం కొలిక్కి రాలేదు. దీంతో మరిన్ని రోజులు చికెన్, కోడిగుడ్లు అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఏకపక్షంగా హెచ్‌కేఎంసీఎఫ్‌కు అప్పగింత
2008లో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన నాటి నుంచి మెస్సుల నిర్వహణను టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వాహకులను ఎంపిక చేసి వారికి అప్పగించేవారు. గత ఏడాది దసరా సెలవులు అనంతరం మెస్‌లను హరే కృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ఏకపక్షంగా అప్పగించారు. అయితే తాము చికెన్, కోడిగుడ్లు పెట్టమంటూ ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్జీయూకేటీ యాజమాన్యానికి స్పష్టం చేశారు. దీంతో అప్పట్లో ట్రిపుల్ ఐటీలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కోడిగుడ్లు, చికెన్ విద్యార్థులకు పెట్టించారు. వేసవి సెలవుల వరకు ప్రైవేట్ వ్యక్తులు అందించగా.. ఈ విద్యా సంవత్సరంలో ఆర్జీయూకేటీ అధికారులు అందించే రేట్లకు పెట్టలేమని తెలియజేశారు. దీంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఆర్జీయూకేటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కోడిగుడ్డు, చికెన్ పెట్టనప్పుడు మెస్‌ల నిర్వహణను హరేకృష్ణ ఫౌండేషన్‌కు కాకుండా టెండర్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదనే అభిప్రాయాలు పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వ్యక్తమవుతున్నాయి. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పినట్లు ఆర్జీయూకేటీ అధికారులు వింటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎగ్గొట్టిన ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిధుల కొరతతో గత రెండేళ్లుగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్‌లు, కనీస సౌకర్యాలు ఆర్జీయూకేటీ అందించలేకపోయింది. ట్రిపుల్ ఐటీ ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాగానే ల్యాప్‌టాప్, రెండు జతలు యూనిఫాం, ఒక జత స్పోర్ట్స్ యూనిఫాం, రెండు జతలు బూట్లు, ఒక జత స్పోర్ట్స్ బూట్లు, ఒక బెడ్డు, దుప్పటి, ఫిల్లోస్ అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో విద్యార్థులకు సరైన కనీస సౌకర్యాలు అందించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.


