ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదివారం అండర్ 14, 16 విభాగాల్లో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మద్ బాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీరకళ్యాణ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 11, 12, 13 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. వివరాలకు 9949686586, 8019880995 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.
బాధ్యతల స్వీకరణ
కడప రూరల్ : ఏపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జిల్లా కో ఆర్డినేటర్ గా జయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ప్రకాశం జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పని చేసిన ఉదయశ్రీ పదవీ విరమణ పొందారు.
ప్రజాభిప్రాయమే కొలమానం
కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్ రోడ్స్ : ప్రజా సేవల నాణ్యతకు ప్రజల అభిప్రాయమే కొలమానం అని.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీజీఆర్‌ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని నిరంతరం అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ‘క్యూఆర్ కోడ్‘లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల స్పందన ఆధారంగానే ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం సాధ్యం అవుతుందన్నారు.
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధీ మీనా
కడప సెవెన్ రోడ్స్ : పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు అందజేసే ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ నిధీ మీనా అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆమె ప్రజల ఆర్జీలు స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇకపై యాప్‌లోనే లావాదేవీలు
సాక్షి, మదనపల్లె : స్వయం సహాయక సంఘాల సభ్యులకు మన డబ్బులు–మన లెక్కలు యాప్ వినియోగంపై మెప్మా ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీఈఐబీ నాగరాజు, టీఈ సీయంయం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘ సభ్యులు తమ పొదుపులు, రుణాలు, చెల్లించిన, చెల్లించాల్సిన వాయిదాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మెప్మా కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. యాప్‌లోని మొబైల్ బుక్ కీపింగ్ విధానాన్ని ఉపయోగించి సంఘాల ఆర్థిక లావాదేవీలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే నవంబర్‌నాటికి స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ తమ ఆర్థిక లెక్కలను యాప్‌లో స్వయంగా చూసుకునే స్థాయికి చేరేలా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ శిక్షణలో సంఘ సభ్యులకు యాప్ వినియోగం, మొబైల్ బుక్ కీపింగ్, ఆర్థిక లావాదేవీల నమోదు తదితర అంశాలపై అవగాహాన కల్పించారు. సీఓలు అనిత, నాగేంద్ర, ఆర్‌పి పుష్ప, సంఘ సభ్యులు హాజరయ్యారు.


