తల్లికి వందనంలో లెక్కాపత్రం ఏదీ! | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనంలో లెక్కాపత్రం ఏదీ!

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

కడప ఎడ్యుకేషన్‌ : ‘బడికి వెళ్లే విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద రూ. 15వేలు ఇస్తాం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలను బడితే పంపితే అంతమందికీ పథకం అమలుచేస్తాం..’ ఎన్నికల ముందు కూటమి నేతలు డప్పు కొట్టి .. కాదు కాదు ఒట్టేసి మరీ చెప్పిన మాటలివి. ప్రభుత్వం కొలువుదీరాక ఒట్టును గట్టున పెట్టింది. ‘...గట్టెక్కాక బోడి మల్లన్న’ అన్నట్లు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టింది. ఇక రెండో ఏడాది నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలకు బదులు రూ.13వేలు చొప్పున బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసింది. ప్రతి తల్లి నుంచి రూ.2వేలు పాఠశాలలో పారిశుద్ద్య నిర్వహణ ఖర్చుల కోసం కోత విధించారు. చివరికి రూ.13వేలు కూడా చాలామంది తల్లులకు జమ కాలేదు. కొందరికి రూ.8వేలు, మరికొందరికి రూ.9వేలు చొప్పున నగదు జమ చేసింది. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులను పలు కారణాలను సాకుగా చూపిస్తూ చాలా మంది తల్లులకు మెండి చేయి చూపించింది.

ఈ ఏడాది ఎంతమందికి లబ్ధి చేకూరేనో..

ఈ నెల 22వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు విడుదలవుతాయని ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌తోపాటు మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతుల ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా గతేడాది 2,72,397 మందికి 13 వేల చొప్పున రూ. 354 కోట్లు విడుదల చేసింది. మరి ఈ ఏడాది ఎంతమంది తల్లిలకు లబ్ధి చేకూరనుందో ఇంకా లెక్కాపత్రం తేల్చలేదు. మరోవైపు ఈ ఏడాది వైఎస్సార్‌జిల్లాకు అన్నమయ్య జిల్లా నుంచి రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలు వచ్చి చేరాయి. దీంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య మూడు లక్షల వరకు పెరగనుంది.

విద్యాహక్కు చట్ట విద్యార్థులకు మొండి చేయి

గతేడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం తల్లికి వందనం నగదు జమ చేయలేదు. అలాగనీ ప్రైవేటు పాఠశాలలకు కూడా ఆ మొత్తాన్ని జమ చేయలేదు. దీంతో పాఠశాలల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పిల్లల ఫీజులు చెల్లింపు విషయమై ఈసడింపులు తప్ప లేదు. జిల్లాలో ఇలా ఆర్‌టీఈ కింద చదివే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు.

గత ఏడాది చాలామంది తల్లులకు మొండిచేయి

ఈ ఏడాది ఎంతమందికి దక్కేనో..

పలు నిబంధనలతో కూడిన చిట్టా విడుదల

22 నుంచి తల్లుల ఖాతాలకు నగదు జమ

అమ్మ ఒడి పేరు చెబితే..

జగన్‌ గుర్తుకొస్తారు

పాదయాత్రలో పేదల అవస్థలను కళ్లారా చూసి, పిల్లల చదువులు భరోసా ఇవ్వాలని సంకల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తాను అధికారంలోకి రాగానే అమ్మ ఒడి పేరుతో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు అదే పథకానికి కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’అంటూ పేరు మార్చేసి తామే కొత్తగా ప్రారంభించినట్లు చెప్పుకోవడం గమనార్హం.

కోతల కోసం షరతులు..

తల్లికి వందనం పథకం కింద చాలావరకూ అర్హులను కోత కోసేందుకు కఠిన షరతులు విధించారని విమర్శలొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉంటేనే ఈ పథకం వర్తించనుంది. అలాగే కుటుంబానికి రేషన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట ఉంటేనే అర్హులు. అంతకుమించి ఉంటే పథకం విర్తించదు. ట్రాక్టర్‌, ఆటో మినహా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వాడకం ఉండరాదు. 1000 చదరపు అడుగులకు మించి మున్సిపల్‌ ఆస్తి ఉండకూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్‌, ఆదాయపన్ను చెల్లించేవారు ఉండకూడదని నిబంధనలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement