చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి ఇచ్చారు. నూతన ఆలయ మహాకుంభాభిషేకం తర్వాత భక్తుల రద్దీ పెరిగినా, క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఈనెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. ఆలయ నిధులు రూ.75 లక్షలతో స్టీల్‌తో శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆలయ సహాయ కమిషనర్ సి.విశ్వనాథ్ తెలిపారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి, భక్తుల రద్దీ పెరిగే శ్రావణ మాసం లోపు ఈ క్యూలైన్లను అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు.
నేడు ’డయల్ యువర్
సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ
డయల్ యువర్ ఎస్‌ఈ
సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్‌కు, వైఎస్సార్ జిల్లా వినియోగదారులు 08562 242457 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
పలు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ఎర్రగుంట్లలో అత్యధికంగా 24.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే ఖాజీపేటలో 15.2, వల్లూరులో 14.6, చెన్నూరులో 12.6, ఒంటిమిట్ట 12.2, కమలాపురంలో 11.4, సికెదిన్నెలో 9.8, నందలూరులో 9.6, కడపలో 7.8, చాపాడులో 7.4, వీర పలి,తొండూరులో 6.8, సింహాద్రిపురంలో 6,4, పెండ్లిమర్రిలో 5.6, రాజంపేటలో 5.4 ,అట్లూరులో 4.8, మైదుకూరులో 3.2, బద్వేల్ 2.8 , ముద్దనూరులో 2.4, బి. కోడూరులో 2.2 ,వీఎన్‌పల్లిలో 1.8, పొద్దుటూరులో 1.4, గోపవరంలో 1.2, కొండాపురంలో 0.8, దువ్వూరు లో 0.4 మి.మీ వర్షం కురిసింది.
26న ఎంపికలు
ప్రొద్దుటూరు కల్చరల్ : చాపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఈనెల 26న సీనియర్ (మెన్ అండ్ ఉమెన్), సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ అంతర్ మండలాల పోటీలు, జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు కడప జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి జి.వెంకటరమణ తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తగిన క్రీడా దుస్తులు, షూస్, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, 10వ తరగతి మార్క్స్ మెమో, ఫొటోలతో ఈనెల 26న ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7036907303 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
దూదేకుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
కడప సెవెన్ రోడ్స్ : దూదేకుల కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా నూర్ భాష్ దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ, వెంకట ప్రసాద్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గటూరుచిన్న రాజా కోరారు. ఆదివారం కడప ఎర్రముక్కపల్లె లోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని జిల్లాలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలసి విన్నవించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు షకీలా వాణి , ప్రధాన కార్యదర్శి నజీర్,కోశాధికారి ఎస్ మహమ్మద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఆలీబాబా తదితరులు పాల్గొన్నారు,


