సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకువచ్చింది. దీనికి ఉమ్మడి జిల్లాలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నందికొండ మున్సిపాలిటీ మినహా మిగతా 18 మున్సిపాలిటీల నుంచి 1,91,187 మంది రూ.19.04 కోట్లు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో 57,554 మంది రూ.5.75 కోట్లు చెల్లించి దరఖాస్తు చేకున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన అప్పట్లో తలెత్తిన న్యాయ వివాదాల కారణంగా పెండింగ్‌లో పడింది. 2024లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తరువాత రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోసారి క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది. నవంబరు 30 వరకు మళ్లీ గడువు పెంచింది. ఆలోగా ఏ మేరకు పరిష్కరిస్తారన్నది వేచిచూడాల్సిందే.
పరిశీనలో విఫలం
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆరేళ్ల కిందట ఒక్కొక్కరు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లాలో దాదాపు 1.91 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. వారిలో చాలా మంది వాటి డాక్యుమెంట్స్ సకాలంలో అప్‌లోడ్ చేయలేదు. ప్రస్తుతం వారు ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా (ఆన్‌లైన్‌లో) డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు.
ప్రాసెస్ చేసిందీ
మూడో వంతే...
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 1,91,187 మంది ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం మూడో వంతు దరఖాస్తులను మాత్రమే అధికారులు ఇప్పటివరకు ప్రాసెస్ చేయగలిగారు. వాటిల్లో 8వేల దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు సరైన డాక్యుమెంట్స్ లేవని మరో 25 వేల దరఖాస్తులను పక్కన పెట్టారు. కేవలం 28,543 దరఖాస్తులను మాత్రమే పూర్తి స్థాయిలో పరిశీలించి ఫీజు చెల్లించాక క్రమబద్ధీకరణకు ఓకే చెప్పారు. మరో 32 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులను చెల్లించి ఉన్నా వాటిని ఇంకా పరిష్కరించలేదు.
ఫ నందికొండ మున్సిపాలిటీకి ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదు


