భువనగిరి: క్షేత్ర స్థాయిలో పనిచేసే బోధనేతర సిబ్బంది పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మధ్య వారదులుగా ఉండాలని డీఈఓ భిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కన్వెన్షన్‌సెంటర్‌లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. డీఈఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో బోధనేతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు.కార్యక్రమంలో విలీన విద్య సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, ఏఎంఓ జానీఆఫ్ఘన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్, స్టేట్ రిసోర్స్ పర్సన్లు రాజేంద్రప్రసాద్, మారుపాక భాస్కర్, సంధ్యారాణి, సీఆర్పీలు, ఎంఐఎస్‌కో ఆర్డినేటర్లు, ఎల్డీఏలు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అర్చకులు మంగళవారం పునః ప్రారంభించారు. పవిత్రోత్సవాల సందర్భంగా రెండు రోజులుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి భక్తులచే జరిపించే పూజలను రద్దు చేసిన విషయం విదితమే. పవిత్రోత్సవాలు సోమవారం ముగియడంతో మంగళవారం తిరిగి ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అర్చకులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు నిర్వహించారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన చేశారు.


