అవినీతి జలగలు..! | - | Sakshi
Sakshi News home page

అవినీతి జలగలు..!

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

పదేళ్లలో 17 మంది అధికారులు..

కొన్ని ప్రభుత్వ శాఖల్లో సాగుతున్న లంచాల పర్వం

సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు అవినీతి జలగల్లా మారారు. పౌర సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా లంచం సమర్పించుకోవాల్సిందే. చేయితడపనిదే ఫైలు కదలని దుస్థితి నెలకొంది. లేదంటే బాధితులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పకుంటున్నారు. జిల్లాలో లంచం తీసుకుంటూ ఎంతో మంది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కి జైలుపాలవుతున్నా ఉద్యోగుల తీరులో మాత్రం మార్పురావడంలేదు. తాజాగా ఆలేరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

బహిరంగంగానే వసూళ్లు

జిల్లాలోని అన్ని శాఖల్లోనూ కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ధరణి సమస్యల పరిష్కారం, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ, ల్యాండ్‌ సర్వేలు, మ్యుటేషన్‌ తదితర పనుల కోసం కొందరు అధికారులు, సిబ్బంది బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. కుల, ఆదాయ, వారసత్వ ధ్రువీకరణ పత్రాల కోసం డబ్బులు ఇవ్వాల్సివస్తోంది. భూభారతి పోర్టల్‌లో సవరణలు చేయడానికి రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి.

ట్రాన్స్‌కో, రిజిస్ట్రేషన్‌, మున్సిపల్‌ శాఖల్లోనూ..

రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్‌, పంచాయతీ రాజ్‌, పోలీస్‌, రవాణా, కార్మిక, నీటిపారుదల, ట్రాన్స్‌కో, పౌరసరఫరాలు, మున్సిపల్‌ తదితర శాఖల్లోనూ లంచాల దందా కొనసాగుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో భువనగిరి మున్సిపాలిటీలో ఓ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడానికి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ఏసీబీకి పట్టుబడడం దీనికి నిదర్శనం.

బాధితుల ఫిర్యాదులతో..

బాధితులు ముందుకు వచ్చి అవినీతి అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆ అధికారులు దాడులు చేసి అవినీతి ఉద్యోగులను పట్టుకోవడం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. వరుస ఏసీబీ దాడులతో అధికార యంత్రాంగంలోని అవినీతిపరుల గుండెల్లో గుబులు మొదలైంది.

ఫ చేయితడపనిదే కదలని ఫైళ్లు

ఫ రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా..

ఫ ఏసీబీకి చిక్కుతున్నా మారని ఉద్యోగుల తీరు

ఫ తాజాగా రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు రెవెన్యూ అధికారులు

యాదగిరిగుట్ట తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్‌ఓలు ఏసీబీకి పట్టుబడి జైలు పాలయ్యారు.

భువనగిరి ట్రాన్స్‌కో డీఈ, రూరల్‌ ఏఈ, లైన్‌మెన్‌ లంచం తీసుకుంటూ గతంలో పట్టుబట్టారు.

2018లో మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు చౌటుప్పల్‌ ఈఓపీఆర్డీ నర్సిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌, భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్‌ రెడ్డి, ఆలేరు పంచాయతీరాజ్‌ ఏఈ ఎ. రమేష్‌, మోటకొండూరు లైన్‌ మన్‌ పప్పుల రమేష్‌, చౌటుప్పల్‌ ట్రాన్స్‌కో ఏడీ శ్యాంకుమార్‌ గతంలో పట్టుబడ్డారు.

2025 అక్టోబర్‌ 30న యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్‌ శాఖ ఈఈ రామారావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

2026 మార్చి12న మోత్కూరు సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఎండీ ఖదీర్‌ ఏసీబీకి చిక్కారు.

తాజాగా ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచందర్‌రావు, కొలనుపాక జీపీఓ షేక్‌ అహ్మద్‌ లు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement