మిన్నంటిన ఆర్తనాదాలు | - | Sakshi
Sakshi News home page

మిన్నంటిన ఆర్తనాదాలు

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

కోదాడ, కోదాడ రూరల్‌ : కోదాడ మండలం దోరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురి మృతదేహాలను, గాయపడిన వారిని స్థానికుల సహాయంతో ఉదయం ఐదున్నర గంటల వరకు కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని డాక్టర్లు సూచించగా.. వారు సూర్యాపేట, ఖమ్మం, విజయవాడకు వెళ్లారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో కోదాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉండగా.. ‘ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో మాకు ఈ శిక్ష విధించావు ఎందుకు దేవుడా..’ అని వారి కుటుంబ సభ్యులు రోదించడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు సైతం కన్నీరు పెట్టారు. మృతురాలు భావనవర్ష తల్లిదండ్రులు కోదాడకు వచ్చేంత వరకు కూడా ఆమె మృతి చెందిన విషయాన్ని బంధువులు వారికి తెలుపలేదు. వారు మార్చురీ వద్దకు వచ్చి అక్కడ ఉన్న వాతావరణాన్ని పసిగట్టి ‘నా బిడ్డ ఎక్కడ అంటూ..’ గుండెలు పగిలేలా రోదించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మృతుల పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా సూర్యాపేట కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అంబులెన్స్‌లను కోదాడకు పంపించి మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఇనుప పిల్లర్లు బలంగా గుద్దుకోవడంతో మృతు ల మాంసపు ముద్దలు ఘటనా స్థలంలో పడిపోయాయి.

భారీగా ట్రాఫిక్‌ జాం..

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన తర్వాత లారీలోని ఇనుప పిల్లర్లు జాతీయ రహదారిపై రెండువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ నుంచి హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపై భారీగా ఆగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన ఇనుప పిల్లర్లను ఒక్కొక్కటిగా క్రేన్‌ సహాయంలో తొలగిస్తూ నెమ్మదిగా వాహనాలను పంపించారు.

హైదరాబాద్‌లో చికిత్స

పొందుతున్న బస్సు డ్రైవర్‌

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారై.. హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని కోదాడ రూరల్‌ ఎస్‌ఐ యాకూబ్‌ తెలిపారు. అదేవిధంగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌, క్లీనర్‌ కూడా పరారైనట్లు పేర్కొన్నారు.

పక్కనే కూర్చున్నా..

ప్రాణాలు కాపాడలేకపోయా..

ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య పక్క సీట్లోనే కూర్చున్నా.. ఆమెను కాపాడుకోలేకపోయానని మృతురాలు యాసారపు చిన్ని భర్త సుధాకర్‌ కోదాడ ప్రభుత్వాస్పత్రిలో రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. యాసారపు చిన్ని తండ్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా.. ఆయనను పరామర్శించేందుకు చిన్నితో పాటు ఆమె భర్త సుధాకర్‌ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టికెట్‌ బుక్‌ చేసుకొని సొంతూరుకు బయల్దేరారు. భార్యాభర్తలిద్దరు డ్రైవర్‌ వెనుక రెండో సీటులో కూర్చున్నారు. చిన్ని కిటికీ వైపు కూర్చోగా.. సుధాకర్‌ ఆమె పక్కనే కూర్చున్నాడు. ప్రమాద సమయంలో కిటికీ వైపు ఉన్న చిన్నికి ఇనుప పిల్లర్‌ బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. సుధాకర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోనే ఉండమన్నా వినకుండా బయల్దేరామని.. అప్పటి వరకు తన పక్కనే ఉన్న భార్య ప్రాణాలు కోల్పోయిందని సుధాకర్‌ కన్నీరుమున్నీరయయ్యాడు.

ఫ మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో

దద్దరిల్లిన కోదాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement