యాదగిరి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు మార్గంలో చేపట్టిన నెట్‌వర్క్ బ్రిడ్జి పనులు మరో రెండు నెలల్లో పూర్తవుతాయి. ఇప్పటికే లండన్ కేబుల్ అనుసంధానం పూర్తయింది. ప్రస్తుతం ఫ్లైఓవర్‌పై బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇది కాగానే జాయింట్లు వేస్తాం. కాంట్రాక్టర్‌కు శామీర్‌పేట్ ఫ్లైఓవర్‌తో పాటు గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా ఉండడం వల్ల ఫ్లైఓవర్ పనులు కాస్త నెమ్మదించాయి. అయినప్పటికీ రెండు నెలల్లో పనులు పూర్తిచేసి ఇస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు.
– భరత్, ఆర్‌అండ్‌బీ ఏఈ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు కొండపైకి సులువుగా చేరుకునేందుకు చేపట్టిన నెట్‌వర్క్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ఐదేళ్లుగా ఆగుతూ.. సాగుతూ సాగిన ఈ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేసి, దేవస్థానానికి అప్పగించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. రూ.32 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బ్రిడ్జి కోసం ఇటీవల లండన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కేబుల్స్ అనుసంధాన ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేశారు.
రూ.32 కోట్లతో 2021లో శ్రీకారం
ఆర్యవైశ్య సత్రం నుంచి యాదగిరి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని జీయర్ కుటీర్ వరకు ఈ నెట్‌వర్క్ బ్రిడ్జిని అనుసంధానం చేయాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వైటీడీఏ అధికారులను ఆదేశించింది. 490 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం రూ.32 కోట్లు కేటాయించడంతో, 2021 చివర్లో పనులు ప్రారంభమయ్యాయి. మొదట ‘సీ ఫైవ్’ అనే కాంట్రాక్టు సంస్థ టెండర్ దక్కించుకుంది. భూసేకరణ పూర్తి కాగానే ప్రారంభంలో పనులు వేగంగానే జరిగినప్పటికీ.. ఆ తర్వాత నిధుల కొరత, లండన్ నుంచి కేబుల్స్ రావడం ఆలస్యం కావడం వంటి సాకులతో 2023లో పనులను పూర్తిగా నిలిపివేశారు.
రెండేళ్ల నిరీక్షణ..
కేవలం 64 మీ. పొడవు, 12 మీ. వెడల్పు మేర ఉన్న కీలకమైన పనులు దాదాపు రెండేళ్లపాటు నిలిచిపోయాయి. అయితే, ప్రధాన ఆలయ పునఃప్రారంభం (ఉద్ఘాటన) తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొండపైకి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు విడివిడి రహదారులు ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని భావించిన ఆర్‌అండ్‌బీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత కాంట్రాక్టు సంస్థ ‘సీ ఫైవ్’ టెండరును రద్దు చేసి, 2025లో ‘బీకేమ్’ సంస్థకు పనులను అప్పగించారు. ఈ కొత్త కాంట్రాక్టర్ 2025 ఆగస్టు 25న పనులను పునఃప్రారంభించి, అదే ఏడాది డిసెంబరు నాటికి లండన్ కేబుల్స్ బిగించే ప్రక్రియను పూర్తి చేశారు. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం బ్రిడ్జిపై బీటీ రోడ్డు లేయర్ వేసే పనులు నడుస్తున్నాయి. దీని తర్వాత జాయింట్లు వేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ట్రయల్ రన్ తర్వాతే అనుమతి
ఈ పనులన్నింటినీ మరో రెండు నెలల్లో పూర్తి చేసి ఆర్‌అండ్‌బీ అధికారులకు అప్పగించనున్నట్లు కాంట్రాక్ట్ సంస్థ తెలిపింది. ఆ వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులు బ్రిడ్జిపై ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అది విజయవంతం కాగానే ఆలయ అధికారులకు బ్రిడ్జిని అప్పగిస్తారు. ఆ తర్వాతే కొండపైకి వెళ్లేందుకు (ఎంట్రీ), కిందికి వచ్చేందుకు (ఎగ్జిట్) వన్‌వే పద్ధతిలో వాహనాల రాకపోకలకు ఆలయాధికారులు అనుమతి ఇవ్వనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి కొండపైకి వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఎంట్రీ ఫ్లై ఓవర్‌పై బిగించిన కేబుల్స్ ఎంట్రీ ఫ్లై ఓవర్‌పై బీటీ లేయర్ పనులు చేస్తున్న దృశ్యం
ఫ చివరి దశకు నెట్‌వర్క్ బ్రిడ్జి పనులు
ఫ లండన్ కేబుల్స్ అనుసంధానం పూర్తి
ఫ వేగంగా సాగుతున్న బీటీ రోడ్డు పనులు
ఫ రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి..


