రాజాపేట : జిల్లావ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, లైబ్రేరియన్ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యా సంస్థల సమన్వయ అధికారి పి.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలో ఈ నెల 18న డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అధ్యాపకుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు.. సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలు జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో శ్రీఆంజనేయస్వామిని సింధూరంతో అభిషేకించి తమలపాకులతో అర్చన చేశారు. ఇక స్వామివారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్య నిర్వహించారు.
రైతు బజార్‌లో కూరగాయల కొరత
భువనగిరి : భువనగిరి రైతు బజార్‌లో రెండు రోజులుగా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని రైతు బజార్ వెలుపల వ్యాపారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయించారు. సాధారణంగా రైతు బజార్‌కు నిత్యం భువనగిరి పరిసర ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నుంచి వ్యాపారులు వాహనాల ద్వారా కూరగాయలను తీసుకువస్తారు. హైదరాబాద్‌లో కూరగాయల ధరలు అధికంగా ఉండడం.. భువనగిరి రైతు బజార్‌లో ధరలు తక్కువగా నిర్ణయించడం వల్ల తమకు నష్టం కలుగుతోందని వ్యాపారులు కూరగాయల సరఫరా నిలిపివేశారు. కూరగాయలు లేకపోవడంతో రెండు రోజులుగా రైతు బజార్‌లో స్టాల్స్‌ను మూసివేశారు.
జాబ్‌మేళాలో 340 మంది ఎంపిక
నల్లగొండ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మంగళవారం అప్రెంటిస్‌షిప్–ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో 25 సంస్థలకు చెందిన ప్రతినిధులు, అధికారులు పాల్గొని సుమారు 500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 340 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ సందర్భంగా డీఐఈఓ దస్రూ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు త్వరగా ఉద్యోగ రంగంలో అడుగు పెట్టాలంటే అప్రెంటిస్ పూర్తి చేయడం ఎంతో అవసరమన్నారు. ఇందుకు ఉద్యోగ మేళాలు మంచి వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యామండలి ఉద్యోగ మేళాల సమన్వయకర్త నండూరి శ్రీనివాస్, కళాశాల ప్రధానాచార్యులు ఎ.ఉపేందర్, సూర్యాపేట డీఐఈఓ బి.సులోచన రాణి, యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్ అధికారి డి.సురేష్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


