సాక్షి, యాదాద్రి : ఎల్‌నినో జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావ పరిస్థితులతోపాటు ఎండలు మండుతుండడంతో తాగునీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే సమయంలో మున్సిపాలిటీలు, గ్రామాలకు నీటి సరఫరా గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో రోజువారీ తాగునీటి డిమాండ్ 88.76 ఎంఎల్‌డీలు (మిలియన్ లీటర్లు ఫర్ డే) కాగా, ప్రస్తుతం అందులో కేవలం 51.19 ఎంఎల్‌డీల (57.67 శాతం) సరఫరా మాత్రమే అవుతోంది. మిగిలిన 42 శాతం లోటును అధిగమించడానికి స్థానిక బోరుబావుల నుంచి నీటిని సేకరించి, మిషన్ భగీరథ నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు.
సగానికి పైగా కోత..
జిల్లాలోని ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 516 ఆవాసాలు, యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలు, వైటీడీఏ దేవస్థానానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ద్వారా నీరు సరఫరా అవుతోంది. 64.64 ఎంఎల్‌డీలు నీరు అవసరం కాగా.. ప్రస్తుత 29.98 ఎంఎల్‌డీల నీరు సరఫరా అవుతోంది. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు 59.90 ఎంఎల్‌డీల తాగునీరు అవసరం కాగా.. కేవలం 26.36 ఎంఎల్‌డీలు (44.01 శాతం) మాత్రమే అందుతోంది. ఈ కొరతను తీర్చడానికి స్థానిక పంచాయతీలు ప్రైవేట్ బోర్లు, ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నాయి. భగీరథ నీటికి స్థానిక బోర్ల నీటిని కలిపి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తీరని దాహం..
జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు గోదావరి, కృష్ణా జలాలను తాగునీటి కోసం అందిస్తున్నారు. ఘణపూర్‌గుట్ట రిజర్వాయర్ ద్వారా ఆలేరు, ఆత్మకూర్, బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూర్, గుండాల, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 516 ఆవాసాలకు గోదావరి నీటిని సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా చౌటుప్పల్, నారాయణపూర్, పోచంపల్లి, వలిగొండ మండలాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా కృష్ణా నీటిని.. రామన్నపేట, మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు ఉదయ సముద్రం ద్వారా కృష్ణా జలాలను అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎక్కడా అమలు కావడం లేదు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో భారీగా కోత
ఫ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం
ఫ ప్రత్యామ్నాయంగా బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
ఫ సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మోటకొండూరు మండలంలోని కాటేపల్లి గ్రామానికి మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా ప్రతిరోజు 80 వేల లీటర్ల నీరు వచ్చేది. గ్రామంలో ఉన్న మూడు నీటి ట్యాంకులను భగీరథ నీటితో నింపి ఇంటింటికీ సరఫరా చేసేవారు. కానీ 20 రోజులుగా రోజు విడిచి రోజు, అది కూడా రెండు గంటల లోపే నీరు వస్తోంది. దీంతో గ్రామంలోని బీరప్ప ఆలయం వద్ద ఉన్న బోరు నుంచి నీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. ఈ విషయమై సర్పంచ్ పచ్చిమట్ల జయమ్మ మదార్‌గౌడ్ మాట్లాడుతూ.. తాత్కాలికంగా తన వ్యవసాయ బావి నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ శివారులోని వాగు వద్ద ఉన్న పంచాయతీ బోరు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేస్తే తప్ప ఈ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేలా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లా కనెక్షన్లు 1,76,000
చేతిపంపుల సంఖ్య 3868
పీడబ్ల్యూఎస్ స్కీమ్ బోర్ల సంఖ్య 628
ఎంపీడబ్ల్యూఎస్ స్కీమ్ బోర్ల సంఖ్య 114
మొత్తం మండలాలు 17
మున్సిపాలిటీలు 6
గ్రామపంచాయతీలు 421
ఆవాసాలు 800


