ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేటి సమాజంలో విద్యార్థులే లక్ష్యంగా జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో ’క్రాఫ్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు యువత ఎదుర్కొంటున్న సమస్యలు – పరిహారం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, ర్యాగింగ్, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగకుండా క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉచిత న్యాయ సహాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే రాజీయోగ్యమైన కేసులు, సివిల్ తగాదాల పరిష్కారానికి ’మధ్యవర్తిత్వం 3.0’ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పి.రత్నరాజు, ప్యానెల్ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు, క్రాఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


