రోడ్డు ఇలా.. ప్రయాణమెలా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ఇలా.. ప్రయాణమెలా?

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

నిత్యం రద్దీ

దారుణంగా ఉండి – గణపవరం రోడ్డు

వర్షాలకు దెబ్బతిన్న రహదారి

నాసిరకం పనులే కారణం

ఉండి: ఉండి జంక్షన్‌ నుంచి ప్రారంభమయ్యే ఉండి–గణపవరం స్టేట్‌ హైవే (232) ప్రయాణికులు, వాహనదారుల పాలిట మృత్యుపాశంగా మారింది. ఉండి శివారు రామచంద్రాపురం నుంచి పాములపర్రు, కోలమూరు మండల శివారు ఆరేడు గ్రామం దాటే వరకు రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది. సాధారణంగా రోడ్లపై గుంతలు, రాళ్లు తేలడం చూస్తుంటాం. కానీ, ఈ రహదారి మాత్రం ఏకంగా అడ్డంగా, నిలువునా చీలికలై విడిపోతుండటం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

నాసిరకం పనుల వల్లే

సుమారు 15 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారి పొడవునా ఒకవైపు పంటబోదెలు, మరోవైపు బొండాడ మేజర్‌ డ్రెయిన్‌, పంట కాలువలు ఉన్నాయి. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం మరింత పటిష్టంగా చేపటాల్సి ఉండగా, గత వేసవిలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నాసిరకం పనులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకోవడంతో, స్వల్ప కాలంలోనే రోడ్డు ఎక్కడికక్కడ కుంగిపోయి చీలికలుగా మారిపోయింది.

ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంతో పాటు జాతీయ రహదారి ద్వారా విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది కీలక మార్గం. అంతేకాకుండా చినతిరుపతికి వెళ్లే కాలనడక భక్తులు సైతం ఈ రోడ్డు పై నుంచే వెళ్తుంటారు. రోడ్డు దుస్థితి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement