భీమవరం: ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజిఆర్‌ఎస్‌లో భాగంగా పలువురు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వినతులను నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 23 ఆర్జీలను స్వీకరించారు. ఏఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
పాలకోడేరు: విస్సాకోడేరులోని స్పెషలైజ్డ్ ఎడాప్షన్ ఏజెన్సీ (శిశుగృహ)ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సత్యనారాయణరాజు, సభ్యులు పి.నాగ మానస, మౌదల గంగా సూర్యనారాయణ సోమవారం సందర్శించారు. శిశుగృహలో బాలల ఆరోగ్య పరిస్థితి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిశుగృహ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించిన విద్యార్థిని ఆకుల శశిదీప్తిని సన్మానించారు. విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలు, బాలల సంరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. నరసాపురం ఎంఈఓ పి.పుష్పరాజ్యం, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు.
భీమవరం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాలకు కారణమైన శాప్ కార్యాలయం వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిరసనకు వెళ్లకుండా ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నిరసనకు అనుమతులు లేవంటూ పోలీసులు నోటీసులు ఇచ్చి సందీప్‌ను అడ్డుకున్నారు.
భీమవరం: భీమవరం–ఉండి రైల్వే స్టేషన్ల మధ్యలో సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ఆరెంజ్, బ్లూ రంగుల చెక్స్ షర్టు, నేవీ బ్లూ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిస్తే భీమవరం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కి సమాచారం అందించాలని కోరారు.
ఏలూరు టౌన్: తమ్మిలేరు కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగిన ఘటన సోమవారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏలూరు రూ రల్ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయ మార్గంలోని తమ్మిలేరు కాలువ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. నలుగురు స్నేహితులు కలిసి తమ్మిలేరు కాలువ వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కొన ఊపిరితో ఉన్న కనకం పవన్ (17)ను బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు సమాచారం. మృతుడు శనివారపుపేట జగనన్న కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. ఇదిలా ఉండగా కాలువలో మునిగిపోయిన షేక్ ఖలీఫ్ రోషన్ అనే యువకుడి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాలువ గట్టుపై ఉన్న మరో ఇద్దరు స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాలువలోకి దిగొద్దని అక్కడ చేపలు పడుతున్న వారు హెచ్చరించినా వినకుండా ఇద్దరు యువకులు నీటిలోకి దిగినట్టు స్థానికుల నుంచి సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.


