కఠిన చర్యలు తీసుకుంటాం
కై కలూరు: పామర్రు – దిగమర్రు జాతీయ రహదారి (165) విస్తరణ పనుల్లో భాగంగా కై కలూరు మండలం గోపవరం–అగ్రహారం మధ్య కొత్తగా నిర్మించిన రహదారి మందుబాబులకు నిలయంగా మారింది. అధికారులు ఇంకా అధికారికంగా ప్రారంభించకముందే, ఈ రోడ్డు పక్కన ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్ పీకలు, క్యారీబ్యాగులు దర్శనమిస్తున్నాయి. రూ. 1,000 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా, మండవల్లి మండలం భైరవపట్నం నుంచి గోనెపాడు వరకు రూ. 129.65 కోట్లతో 4 లైన్ల రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందులో కై కలూరు మండలం గోపవరం నుంచి ఆటపాక సమీప అగ్రహారం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తయింది.
చీకటి మాటున విచ్చలవిడిగా పార్టీలు
రహదారి పూర్తయిన ప్రాంతాల్లో రాత్రివేళ విద్యుత్ దీపాలు (లైటింగ్) లేకపోవడం, చుట్టూ వరి పొలాలు, ఆక్వా చెరువులు ఉండి ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటాన్ని మందుబాబులు ఆసరాగా చేసుకుంటున్నారు. కార్లలో వచ్చి రాత్రివేళల్లో జన్మదిన వేడుకలు (బర్త్‌డే పార్టీలు), మద్యం విందులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయాన్నే పొలాల వద్దకు వచ్చే రైతులు, అక్కడ పేరుకుపోతున్న చెత్తను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పగటిపూటా అదే తీరు
కై కలూరు నుంచి గోపవరం, ఆటపాక మీదుగా జాతీయ రహదారికి, అలాగే వరహాపట్నం మీదుగా కలిదిండి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి స్వల్ప దూర మార్గం (షార్ట్‌కట్) కావడంతో ప్రయాణాలు పెరిగాయి. మందుబాబులు కై కలూరు రైల్వే గేటు సమీపంలోని షాపుల్లో మద్యం కొనుగోలు చేసి, వాహనాలపై ఇక్కడికి చేరుకుంటున్నారు. పగటిపూట కూడా పొలాల గట్లపై గుంపులుగా కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఇటీవల ఈ రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రోడ్డుపై ఉన్న మద్యం సీసాలను చూసి, వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ మందుబాబుల ఆగడాలు ఆగడం లేదు.
హైవే రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఇటీవల ఇక్కడ పార్టీ చేసుకుంటున్న 11 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చాం. పొలాల యజమానులతో కూడా మాట్లాడాం. రాత్రి పూట గస్తీ (పెట్రోలింగ్) పెంచి బహిరంగ మద్యపానాన్ని పూర్తిగా అరికడతాం.‘
– ఏవీఎస్.రామకృష్ణ, టౌన్ సీఐ, కై కలూరు
గోపవరం–అగ్రహారం జాతీయ రహదారిపై మందుబాబుల హల్‌చల్
పొలాల సమీపంలో లభ్యమవుతున్న మద్యం సీసాలు, వ్యర్థాలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక రైతులు


