కాళ్ల: గుర్తుతెలియని వ్యక్తి జరిపిన దాడిలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలైన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. పెద అమిరంలో నివాసముంటూ ఉండి మండలం ఎన్‌ఆర్‌పి అగ్రహారంలో టీచర్‌గా పనిచేస్తున్న ఎస్.వెంకటరత్నం ఉదయం పూట సైక్లింగ్ చేస్తుండగా, ఓ గుర్తుతెలియని వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఉపాధ్యాయుడి తలకు తీవ్ర గాయం కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి సమయస్ఫూర్తితో వైద్య సాయం అందించి ప్రాణాలు కాపాడిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఎస్. జగదీశ్ బాబును ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ అభినందించారు. సోమవారం మధ్యాహ్నం దుగ్గిరాల జాతీయ రహదారిపై విధి నిర్వహణలో ఉన్న ఏఎంవీఐ జగదీశ్ బాబు, రోడ్డు పక్కన గుర్తుతెలియని వాహనం ఢీకొని రక్తపు మడుగులో పడివున్న ఒక యువకుడిని గమనించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, అది వచ్చే వరకు అక్కడే ఉండి బాధితుడికి ప్రాథమిక సాయం అందించారు. అనంతరం యువకుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మానవత్వం చాటుకున్న జగదీశ్ బాబు సమయస్ఫూర్తి రవాణా శాఖ అధికారులందరికీ ఆదర్శనీయమని డీటీసీ షేక్ కరీమ్ ప్రశంసించారు.


