వృద్ధుడిపై యువకుడి దాడి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడిపై యువకుడి దాడి

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

వృద్ధుడిపై యువకుడి దాడి కుటుంబంపై దాడి లారీ ఢీకొని వ్యక్తి మృతి విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి గోదావరిలో దూకి వివాహిత మృతి

భీమవరం: బైక్‌కు అడ్డువచ్చాడనే నెపంతో ఒక యువకుడు జరిపిన దాడిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అత్తిలిలో పొగాకు వ్యాపారం ముగించుకుని పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి వెళ్లేందుకు వి. ప్రకాశరావు (60) శుక్రవారం భీమవరం బస్టాండు వద్ద రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఎం.రత్నకుమార్‌ బైక్‌పై వెళ్తూ, తన వాహనానికి అడ్డువచ్చాడని ప్రకాశరావుతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో రత్నకుమార్‌ తోసివేయడంతో ప్రకాశరావు కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీఐ ఎ.రమేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉండి: పరిచయస్తురాలైన మహిళ వివరాలు చెప్పకపోవడంతో ఆమె కుటుంబసభ్యులపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి నిమ్మనపేటకు చెందిన దువ్వి సూరిబాబుకు గ్రామ శివారు రామాపురానికి చెందిన ఏసు కుమార్తెతో పరిచయం ఉంది. అయితే కొంతకాలంగా ఆమె కనిపించకపోవడంతో ఈనెల 12న రాత్రి సూరిబాబు ఏసు ఇంటికి వెళ్లాడు. సదరు మహిళ కోసం ఆరా తీయగా ఏసు ఏమీ చెప్పకపోవడంతో ఆగ్రహించి పదునైన ఆయుధంతో ఏసుపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఏసు భార్య, మనుమరాలిపైనా దాడికి తెగబడ్డాడు. గాయాలపాలైన వారంతా భీమవరం ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై హెచ్‌. మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టి.నరసాపురం: టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం గుడ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రె ముత్తయ్య (53) మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా గుడ్లపల్లి వద్దకు రాగానే టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తయ్య రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

దెందులూరు: గ్రామంలో విద్యుత్‌ ఘాతానికి గురై గోరిపర్తి నాంచారమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం మృతి చెందింది. భర్త, కుమారుడు ఇదివరకే మరణించడంతో ఆమె కోడలు, మనవడితో కలిసి నివాసం ఉంటుంది. శుక్రవారం మంచినీళ్ల మోటార్‌ స్విచ్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న ఏఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరి వంతెనపై నుంచి దూకి పెచ్చెట్టి దేవీస్మిత (23) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. దేవీస్మిత నదిలో దూకగా గమనించిన మత్స్యకారులు ఆమెను రక్షించి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement