ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆరుగురు భక్తులు వేరువేరుగా ఆదివారం రూ.10,01,333 విరాళంగా అందజేశారు. అందులో భాగంగా నిడమర్రు మండలం మందలపర్రు గ్రామానికి చెందిన పి.రామకృష్ణంరాజు రూ.5 లక్షలు, యలమంచిలికి చెందిన డీవీ శాస్త్రి, నాగలక్ష్మి దంపతులు రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన జోశ్యుల సత్యన్నారాయణ మూర్తి రూ.లక్ష, పాలకొల్లుకు చెందిన ముచ్చర్ల సంజయ్ రూ.1,01,116, తాడేపల్లిగూడెంకు చెందిన దూసనపూడి రమేష్‌కుమార్ రూ.1,00,116, విజయవాడకు చెందిన వేమూరి వేంకట సుబ్బారావు రూ.1,00,101 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం, ఐవీ రామారావు విరాళం బాండ్‌లను అందించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సీ్త్ర శక్తి పథకాన్ని 2.23 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే ఈ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏలూరు డీపీటీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా జిల్లాలో మహిళలకు రూ. 73.56 కోట్లు లబ్ధి చేకూరిందని, రాష్ట్రవ్యాప్తంగా 87 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగా రూ. 3,095 కోట్ల లబ్ధి కలిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోలకు త్వరలో 100 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి పాల్గొన్నారు.
ముదినేపల్లి(కై కలూరు): గ్రామంలో చిట్టీలు కట్టించుకుని నగదు చెల్లించలేదని బాధితులు అడగడంతో ఓ మహిళ అదృశ్యమైన ఘటన వడాలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడాలి గ్రామానికి చెందిన మరీదు ధర్మారావు భార్య అంకమ్మ గ్రామస్తుల వద్ద చిట్టీలు కట్టించుకుంది. ఈ క్రమంలో తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో ఆమె కనిపించకుండా పోయింది. భర్త ఫిర్యాదు మేరకు మహిళా హెడ్ కానిస్టేబుల్ సుధావాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: వివాహేతర సంబంధం ఉన్న మహిళతో పాటు తన భర్త కూడా అదృశ్యమయ్యాడని స్థానిక పోలీస్టేషన్‌లో ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే. మండలంలోని లైన్ గోపాలపురంనకు చెందిన వాడపల్లి గంగాధరరావు గత నెల 27న ఉదయం 11 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య వాడపల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్న గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన మహిళ కూడా అదే రోజు నుంచి కనిపించడం లేదని తెలిపింది. వెంకటలక్ష్మి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
ముగిసిన చెస్ పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పీఎస్‌ఎఫ్‌ఐ, పీఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏలూరు ఓపెన్ చెస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో మొదటి స్థానం సీహెచ్ వివేక్, 2వ స్థానం పీ సుచిత్ర, 3వ స్థానం ఎస్.శైలేష్, 4వ స్థానం జే అక్షిత్, 5వ స్థానం కే నవదీప్ గెలుపొందారు. కార్యక్రమంలో పీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పీ శివశంకర్, పీఎన్‌ఎస్ జిల్లా కార్యదర్శి జీ శారద, అంతర్జాతీయ చెస్ రేటెడ్ ప్లేయర్ డీ లక్ష్మణరావు, చీఫ్ ఆర్బిటర్ కే కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.


