● దొడ్డిదారిన మంతనాలు
● డిపో కావాలంటూ ఆందోళనలు
● ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని రైతుల అల్టిమేటం
కొయ్యలగూడెం: పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని ఆరు గ్రామాల్లో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో అంశం మరోసారి వివాదాస్పదమైంది. సుమారు 1,200 ఎకరాల్లో ఈ డిపో నిర్మించ తలపెట్టగా, గతంలో రైతుల వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ప్రకటించారు. 80 శాతం మంది రైతులు ఆయుధ డిపోను తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాజకీయరంగు, దళారుల దందా ప్రారంభమైందని డిపో వ్యతిరేక రైతులు ఆరోపిస్తున్నారు. దరిమిలా నేవీ ఆయుధ డిపో కావాలంటూ 20 శాతం మంది రైతులు దళారులను కలుపుకుని కిరాయి వ్యక్తులను ఏర్పాటు చేసి ఆందోళనలను ప్రారంభించారని ఆరోపిస్తున్నారు.
దొడ్డిదారిన మంతనాలు
ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు డిపో సానుకూల వ్యక్తులతో మంతనాలు ప్రారంభించారని డిపో వ్యతిరేక రైతులు అంటున్నారు. అలాగేడిపోను వ్యతిరేకిస్తున్న ముఖ్య నేతలను లోబరుచుకుని వారి భూములను భూసేకరణ నుంచి మినహాయించేలా భేరసారాలు ఆడించినట్టు తెలిపారు. ఇందుకూ బాధిత రైతులు ఒప్పుకోకపోవడంతో విభజించి పాలించు అనే వారి ఆలోచన బెడిసి కొట్టింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఆయుధ డిపో ఏర్పాటు చేసి తీరుతామంటూ దళారులు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఇందుకు కీలకంగా అధికార గణం మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయుధ డిపో భూమి సేకరణకు కావాల్సిన మొత్తం భూమిలో సర్వే చేయగా, ఎవరికీ చెందని మిగులు భూమి గుర్తించారని, దాంతో ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకు డాక్యుమెంట్లు సృష్టించి మిగులు భూమిని కాజేసేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారులు మిగులు భూమి నష్టపరిహారాన్ని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దళారులతో అధికారులు చర్చలు జరుపుతున్నారని వాపోతున్నారు. ప్రాణాలు పోయినా సరే పుడమి తల్లిని వదులుకోబోమని డిపో వ్యతిరేక రైతులు అల్టిమేటం జారీ చేయగా, ఈ నేపథ్యంలో చివరకు ఎవరి మాట నెగ్గుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


