బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకూ భారీ వర్షం దంచికొట్టింది. ఈ వర్షానికి ఈ ఏడాది మొట్టమొదటిసారిగా పలు కొండకాల్వలు పొంగిపొర్లాయి. కొండలపై అధికంగా వర్షం కురవడంతో గుబ్బల మంగమ్మ గుడి పై నుంచి వరదనీరు భారీగా బుసలు కొడుతూ ప్రవహించింది. వాన పడుతున్నా ఆదివారం కావడంతో భక్తులు మంగమ్మతల్లి సన్నిధికి చేరుకున్నారు. అప్రమత్తమైన ఆలయ కమిటీవారు భక్తుల భద్రత దృష్ట్యా దర్శనానికి వెళ్లకుండా సుమారు 2 గంటలపాటు నిలిపివేశారు. అనంతరం వరద ఉధృతి తగ్గడంతో భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. పులిరాముడుగూడెం పరిసర ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురిసింది.


