తేగల సాగు.. బహుబాగు | - | Sakshi
Sakshi News home page

తేగల సాగు.. బహుబాగు

Aug 17 2026 1:05 AM | Updated on Aug 17 2026 1:05 AM

పశ్చిమలో సాగు జరిగే ప్రాంతాలు

తేగల సాగుతో జీవనోపాధి

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

ద్వారకాతిరుమల: ఆర్గానిక్‌ ఫుడ్‌.. సూపర్‌ఫుడ్‌.. హెల్త్‌ ఫుడ్‌.. పేరేదైనా ఆరోగ్యకరమైన ఆహారం కోసం మనం నేటి కాలంలో వేలకు వేలు ఖర్చు చేస్తున్నాం. ఖరీదైన ప్యాకెట్లలో పోషకాహారాన్ని వెతుకుతున్న మనకు ప్రకృతి అందించే అద్భుతమైన ఆహారం తేగలు. రుచితో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందించే తేగలు ఒకప్పుడు గ్రామీణుల సాధారణ ఆహారం కాగా.. ఇప్పుడు పట్టణాల్లోనూ ఆరోగ్యాభిలాషుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎలాంటి కృత్రిమ రంగులు, రసాయనాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఈ ఆహారం తక్కువ ఖర్చుతో కడుపు నింపడమే కాకుండా.. పోషకాలను అందించే పల్లె సంపదగా నిలుస్తోంది. శీతాకాలం నుంచి వేసవి ఆరంభం వరకు పల్లెల్లో, పట్టణ కూడళ్లలో గుట్టలుగా దర్శనమిచ్చే తేగల వెనుక ప్రకృతితో మమేకమైన ప్రత్యేక సాగు విధానం, రైతుల శ్రమ దాగి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తేగల సాగు జోరందుకుంది. అతి తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వీటి సాగుపై రైతులు ఆశక్తి చూపుతున్నారు.

తాటి పండ్ల ఎంపిక, సేకరణ ఇలా..

● వర్షాకాలం ఆఖరు(ఆగస్టు – సెప్టెంబర్‌)లో తేగల సాగును ప్రారంభిస్తారు.

● చెట్టు నుంచి సహజంగా కిందపడిన మంచి దృఢమైన పండ్లను రైతులు సేకరిస్తారు.

● తాటి పండ్ల పైన ఉండే మందపాటి నల్లటి తొక్కను తొలగిస్తారు. సాధారణంగా ఒక పండులో 2 నుంచి 3 టెంకలు ఉంటాయి.

● నాణ్యమైన విత్తన టెంక రావడానికి పీచును నీటితో బాగా కడిగి లేదా నేలకు రాసి, గుజ్జు అంతటినీ వేరు చేస్తారు. కొందరు రైతులు పశువులకు వాటిని అందించగా అవి గుజ్జును తిని, టెంకలను విడిచిపెడతాయి.

● బాగా బరువుగా, దృఢంగా ఉన్న టెంకలనే ఎంచుకుంటారు. తేలికగా ఉండే తాలు టెంకలను వేరు చేస్తారు.

● టెంకకు అడుగు భాగంలో ఉన్న ’కన్ను’ దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తపడతారు.

● గుజ్జు తొలగించిన టెంకలను 1–2 రోజులు నీడలో ఆరబెడతారు. దీనివల్ల చీడపీడలు పట్టకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

● ఆ తర్వాత వీటిని తేగ మడుల వద్దకు తరలిస్తారు. ఒక చిన్నపాటి తేగ మడికోసం 500 నుంచి 2,000 వరకు విత్తన టెంకలు అవసరమవుతాయి.

సాగు విధానం ఇలా..

● తేమను పట్టి ఉంచే ఇసుక లేదా మెత్తటి నేలను ఎంచుకుని 1–2 అడుగుల లోతులో మడులు తవ్వుతారు.

● సిద్ధంగా ఉన్న టెంకలను నేలలో ఒకదానికొకటి దగ్గరగా, వరుస క్రమంలో అమర్చి పైన 3 నుంచి 6 అంగుళాల మందంలో మట్టి లేదా ఇసుకను కప్పుతారు.

● ఎప్పటికప్పుడు నీరు చల్లుతూ నేలను తేమగా ఉంచుతారు. టెంక అడుగు భాగం నుంచి మొలక కిందకు పెరుగుతూ లావుపాటి దుంప (తేగ)గా మారుతుంది.

● 3–4 నెలల తర్వాత నేలపైన చిన్న ఆకుపచ్చని మొలకలు రాగానే, గునపంతో నేలను తవ్వి తేగలను టెంకలతో సహా బయటకు తీస్తారు.

● నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ (శీతాకాలం నుంచి వేసవి ప్రారంభం) వరకు మార్కెట్లలో తేగలు విరివిగా అందుబాటులో ఉంటాయి.

తాటి టెంక నుంచి తేగగా మారే అద్భుత ప్రయాణం

పీచు పదార్థాలు, ఖనిజాలతో పోషకాల భాండాగారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలు, లంక గ్రామాలు, తీరప్రాంత మండలాల్లో తాటిచెట్లు అధికంగా ఉండటంతో తేగల పెంపకం, విక్రయాలు విస్తృతంగా జరుగుతుంటాయి. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, యలమంచిలి, పోడూరు ప్రాంతాలతో పాటు ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాల్లో, నల్లజర్ల మండలం అయ్యవరం, టి.నరసాపురం మండలం తెడ్లం వంటి పలు గ్రామాల్లో తేగల సాగు అధికంగా జరుగుతుంది.

మా ఊరిలోనే 50 మంది వరకు తేగల పాతర వేస్తాం. ఉదయాన్నే ట్రాక్టర్‌లో మహిళా కూలీలను తీసుకుని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు వెళ్లి, చెట్ల కింద పడి ఉన్న తాటి పండ్లను సేకరిస్తాం. వాటిని తీసుకొచ్చి పశువుల ముందు వేస్తాం. అవి గుజ్జును తిని విడిచిపెట్టిన టెంకలను శుభ్రం చేస్తాం. ఆ తరువాత పాతర వేస్తాం. పొలం పనులు లేని సమయంలో వీటి ద్వారా జీవనోపాధిని పొందుతున్నాము.

– బత్తిన సురేష్‌, రైతు, అయ్యవరం, నల్లజర్ల మండలం

తేగలు మన పల్లెల్లో సహజంగా లభించే మంచి పోషకాహారం. వీటిలో ఫైబర్‌, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో శరీరానికి శక్తిని అందించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మలబద్ధకాన్ని తగ్గించేందుకు కూడా ఇవి దోహదపడతాయి. మితంగా తీసుకుంటే పొట్ట నిండిన భావన కలిగి, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి.

– ఎ.ప్రవీణ్‌ కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి, ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement