మునగాల : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం అర్ధరాత్రి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలివి. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు శనివారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు అర్ధరాత్రి సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్దకు రాగానే ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయాయి.
క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
ఈ ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న మునగాల ఎస్సై సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ సిబ్బంది, ఎన్‌హెచ్‌ఏఐ–65 సిబ్బంది, ఫైర్ సిబ్బంది సాయంతో రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లి కల్వర్టును ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో 31 మంది, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు ప్రయాణికులను ఇతర బస్సుల్లోకి ఎక్కించి వారి గమ్యస్థానాలకు పంపించారు. గాయపడిన డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్
రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసిన పోలీసులు
ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘటన


