కడుపులో నొప్పి అని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు | - | Sakshi
Sakshi News home page

కడుపులో నొప్పి అని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు

Aug 17 2026 1:05 AM | Updated on Aug 17 2026 1:05 AM

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో యువకుడి మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ

నూజివీడు: కడుపు నొప్పితో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరిన రామకూరి ప్రేమ్‌బాబు (31) అనే వ్యక్తి మరుసటిరోజు తెల్లవారేసరికి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం.. రామకూరి ప్రేమ్‌బాబుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కడుపులో గ్యాస్‌ సమస్య తలెత్తి రెండుసార్లు వాంతులు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, సైలెన్‌ ఎక్కించి అనంతరం వార్డుకు మార్చారు. అయితే, వార్డుకు మార్చినప్పటి నుంచి రాత్రంతా కడుపునొప్పి, ఆయాసం తీవ్రంగా ఉందని, మూత్రం రావడం లేదంటూ ప్రేమ్‌బాబు పలుమార్లు నర్సుకు మొరపెట్టుకున్నా వైద్యులు ఎవరూ వచ్చి పరిశీలించలేదని మృతుడి కుటుంబ సభ్యులు వాపోయారు. చివరికి పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు అతను ఆసుపత్రిలోనే మృతి చెందాడు. వైద్యులు, సిబ్బంది ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణివల్లే తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు రోదిస్తూ ఆరోపించారు. బాధ్యులైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రేమ్‌బాబు మృతికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని మృతుడి బంధువు రాజు తేల్చిచెప్పారు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని, నాలుగు వార్డులకు కేవలం ఒక్కరే నర్సు ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు.

నిజ నిర్ధారణ చేస్తాం

రామకూరి ప్రేమ్‌బాబు మృతిపై నిజ నిర్ధారణ నిమిత్తం విచారణ జరుపుతున్నట్లు రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఎంఓ) డాక్టర్‌ వరప్రసాదరావు స్పష్టం చేశారు. విచారణ కమిటీ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement