న్యూస్‌రీల్
విజేతలు వీరే..
ప్రతిపక్ష పార్టీని విమర్శించడానికే..
పాకాకు అవమానం
● అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవాలు
● ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు
● మువ్వన్నెల జెండా రెపరెపలు
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
భీమవరం: భీమవరం కలెక్టరేట్ వద్ద 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి. జాతీయ పతకాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించి, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్సీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ప్రశంసా పత్రాల ప్రదానం
జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారి కుటుంబాలను సత్కరించారు. ప్రజాసేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను బహూకరించారు. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన సేవకులకు, అధికారులకు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను అందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు పతకాలను అందించారు.
ఆకట్టుకున్న శకటాలు
వైద్యారోగ్య, వ్యవసాయ, అగ్నిమాపక, విద్యాశాఖ, ఎస్‌ఈఆర్‌పీ–జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గృహనిర్మాణ, రవాణా శాఖల శకటాలు ఆకట్టకున్నాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను మంత్రి రామానాయుడు పరిశీలించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని చాటేలా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ఉత్తేజాన్ని రేకెత్తించాయి. రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.ప్రభాకర్, భీమవరం, నరసాపురం ఆర్డీఓలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, తహసీల్దార్ ఆర్.రాంబాబు పాల్గొన్నారు.
వీక్షకులు నామమాత్రం
వీక్షకులు పెద్దగా లేకపోవడంతో వేడుకలు నామమాత్రంగా జరిగాయా అనిపించింది. మంత్రి నిమ్మల, రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే మినహా మిగిలిన ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కలెక్టర్ నాగరాణి జెండా వందనం, పోలీసు కవాతు వరకూ మాత్రమే కనిపించారు. అలాగే గతంతో పోలిస్తే శకటాల సంఖ్య తగ్గింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.
తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థినుల రింగ్ డ్యాన్స్‌కు ప్రథమ, భీమవరం సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థుల దేశభక్తి గేయంకు ద్వితీయ, భీమవరం పీఎంఎస్ బాలికల స్కూల్ విద్యార్థుల ప్రదర్శన, ఉండి హైస్కూల్ విద్యార్థుల కరాటే ప్రదర్శన, కర్రసాముకు తృతీయ బహుమతి లభించాయి. పాలకొల్లు భారతీయ విద్యాభవన్స్ విద్యార్థుల దేశభక్తి గేయం, తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూఏ స్కూల్ విద్యార్థుల నేషనల్ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.
మంత్రి నిమ్మల రామానాయుడు తన ప్రసంగంలో గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఇంటింటికీ పింఛన్, ఆక్వాకు సబ్సిడీ విద్యుత్, ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమచేసే విధానం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేయగా.. కూటమి ప్రభు త్వానిదే ఘనత అన్నట్టు చెప్పుకొచ్చారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను సన్మానించే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణకు ప్రాధాన్యమివ్వలేదు. మంత్రి నిమ్మల, జేసీ కల్పశ్రీ, ఎస్పీ నయీం అస్మి తదితరులు మరో వేదికపై ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి సత్కారాలు చేశారు. అయితే ఆ వేదికపైకి పాకాను పిలవలేదు.


