వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపులు

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

అయితంపూడిలో ఇళ్లు కూల్చివేతపై మండిపాటు

ఇరగవరం: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని, వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపులే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ మాజీ విప్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. మండలంలోని అయితంపూడిలో వందలాది మంది పోలీస్‌ బలగాలను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ భవనంతో పాటు ఐదుగురి ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దుర్మార్గమన్నారు. కూల్చివేసిన ఇళ్లను శనివారం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌, భీమ వరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకట్రాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి ము రళీకృష్ణంరాజు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధిని తాము స్వాగతిస్తామని, కానీ కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంలో అలైన్‌మెంట్‌ను మార్చి తెల్లవారుజామున వందలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకుని ఇళ్లను కూల్చడం దారుణమని ప్రసాదరాజు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాల వేళ ప్రభుత్వం బ్రిటిష్‌ పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పొక్లయిన్లు, 400 మందికి పైగా పోలీసులను మోహరించి ఇళ్లను కూల్చివేసి చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని ఆరోపించారు.

ప్రశ్నించే గొంతులను నొక్కేలా..

పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదేళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేసిన మాజీ సర్పంచ్‌ జితేంద్ర కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.

తగిన మూల్యం తప్పదు

రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడైనందుకే జితేంద్రపై కక్ష సాధించారని, ప్రజా వ్యతిరేకతకు భయపడే వేకువజామున ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.

శాసనమండలిలో ప్రస్తావిస్తా.. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గ్రామ పారిశుధ్య కార్మికులకు 11 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో శాసనమండలిలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎంబీసీ చైర్మన్‌ పెండ్ర వీరన్న, రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, సీఈసీ సభ్యుడు పెనుమత్స సుబ్బరాజు, మండల నాయకులు జాలి సుబ్బరావు, చోడే జోషి, చోడే ఏసు రత్నం, మాజీ సర్పంచ్‌లు ఉప్పులూరి లావణ్య, జితేంద్ర, బెల్లంకొండ హేమ కుమారి, సురేష్‌,సత్తి వెంకట రెడ్డి, దినేష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement