శ్రీవారి కొండపైకి ‘ఫాస్ట్‌ట్యాగ్‌’ ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి కొండపైకి ‘ఫాస్ట్‌ట్యాగ్‌’ ప్రయాణం

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

ద్వారకాతిరుమల ఘాట్‌రోడ్డు టోల్‌గేట్‌ వద్ద కొత్త విధానం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు దేవస్థానం ఘాట్‌రోడ్డులోని టోల్‌గేట్‌ వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో తిరుమల తిరుపతిలో మినహా ఏ క్షేత్రంలోనూ ఈ విధానం అందుబాటులో లేకపోవడం విశేషం. శని, ఆదివారాలు, వారాంతాలు, ఇతర పర్వదినాల్లో ద్వారకాతిరుమల క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయాల్లో టోల్‌గేట్‌ వద్ద వాహనాలు బారులు తీరకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ ఉపయోగపడనుంది. నూతన కాంట్రాక్టర్‌ చేబోలు రాజేష్‌ ఏర్పాటుచేసిన ఈ విధానంతో వాహనదారుల సమయం ఆదా కావడంతో పాటు ఘాట్‌రోడ్డులో రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు దోహదపడుతుంది.

వేగంగా రాకపోకలు

టోల్‌గేట్‌ వద్ద రద్దీకి పరిష్కారంగా ఫాస్ట్‌ట్యాగ్‌ ఏర్పాటు చేయడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్యాగ్‌ ఉన్న వాహనాలు గేట్‌ వద్ద నిలపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా రుసుం చెల్లింపు పూర్తవుతుంది. నిమిషానికి 30 వాహనాలు ముందుకు వెళ్లేలా ఈ సిస్టమ్‌ను అమర్చారు. దీనివల్ల రద్దీ రోజుల్లోనూ టోల్‌గేట్‌ వద్ద వాహనాల నిలుపుదల గణనీయంగా తగ్గుతుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌కు ప్రత్యామ్నాయం : ఫాస్ట్‌ట్యాగ్‌ లేని వాహనదారులు యథావిధిగా నగదు చెల్లించి టికెట్‌ తీసుకునే వెసులుబాటును కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ ఉండవు కాబట్టి నగదు చెల్లించి, టికెట్‌ తీసుకోవాలి. కార్లు వంటి వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ ఉంటుంది కాబట్టి వారు టోల్‌గేటు వద్ద ఆగాల్సిన పనిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement