తణుకు అర్బన్: ఆనాటి ధీరుల త్యాగఫలం కారణంగా సాధించుకున్న స్వాతంత్య్రం మూ లంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నేతృత్వంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తిగా యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, లారెన్స్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశం చౌక్): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధికి యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలని కోరారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గన్‌మెన్ మంతెన శ్రీనివాసరాజు ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో 44 ఏళ్లపాటు సేవలు అందించినందుకుగాను మెడల్‌కు ఎంపికయ్యారు. ఆయన ఇప్పటికే పోలీస్ సేవాపతకం, పోలీస్ ఉత్తమ సేవాపతకం, అతి ఉతృష్ట సేవా పతకాలను అందుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతులమీదుగా పోలీస్ మెడల్‌ను అందుకోనున్నారు.
ఏలూరు టౌన్: దేశ స్వాతంత్య్ర సాధనలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను మరువలేమని ఏలూరు రేంజ్ ఐటీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరులోని రేంజ్ ఐజీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం సమర్పించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద, జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద వేడుకలు జరిగాయి. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహనీయుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రతిఒక్కరూ బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, ఆర్‌ఐ పవన్‌కుమార్, ఆర్‌ఐ సతీష్, ఆర్‌ఎస్‌ఐ భాస్కరరావు, ఏఓ షేక్‌మస్తాన్ ఉన్నారు.


