ఏలూరు చైత్ర ఆస్పత్రిలో సోదాలు
ఏలూరు టౌన్: స్థానిక అశోక్‌నగర్‌లోని చైత్ర హాస్పిటల్‌పై శనివారం ఆకస్మికంగా ఆరు శాఖల అధికారులు మూకుమ్మడిగా దాడులు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు, జీఎస్‌టీ, కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయడం చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలోని మందుల విభాగం, రికార్డులు, ఆరోగ్యశ్రీ పథకం అమలు, భద్రతా చర్యలు, భవన నిర్మాణంలో నిబంధనల అమలు, జీఎస్టీ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, నిర్వహణ, పరిపాలన విభాగాల్లో సోదాలు చేశామని, కొన్ని రికార్డుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అలాగే ఫార్మసీలో కాలం చెల్లిన మందులు గుర్తించారనీ, భవన నిర్మాణంలోనూ నిబంధనలు పాటించలేదనీ, పలు విభాగాల్లో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లభించాయనీ, రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. గతంలోనూ ఈ ఆస్పత్రిపై పలు అభియోగాలు, ఫిర్యాదు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా ఏకకాలంలో ఆరు శాఖల అధికారులు దాడులు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ హరిభగవాన్ వ్యవహార శైలిపైనా జోరుగా చర్చ సాగుతోంది. ఆరోగ్యశ్రీ పథకంలోనూ డబ్బు లు వసూలు చేస్తున్నారనే అపవాదు ఉంది. ఆయన గతంలోనూ పలు వివాదాల్లో కేంద్ర బిందువుగా ఉండటంతో భిన్నమైన చర్చ నడుస్తోంది.


