కొల్లేరు వాసుల కన్నెర్ర
● అటవీ శాఖ ఆంక్షలపై ఆగ్రహం
● ఫారెస్ట్ అధికారులు వర్సెస్ కొల్లేరు వాసులు
● సమస్యను పరిష్కరించని ప్రజాప్రతినిధులు
● అభయారణ్య భూముల్లో సాగుకు యత్నం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు ఒక వైపు కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలను తొలగించి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు ఘాటుగా చురకలు పెట్టింది. మరో వైపు ఎన్నికల్లో అమలుకాని హామీలను ప్రకటించిన ప్రజాప్రతినిధులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా కొల్లేరు ప్రజల ఆశలతో ఆడుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి హడావుడి చేయడం తప్ప తమకేం లాభం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలో జి రాయితీ, డీ–ఫాం, ప్రభుత్వ అనే మూడు కేటగిరిల భూములున్నాయి. మొత్తం అభయారణ్యం 77,138 ఎకరాలుగా నిర్ణయించగా, వీటిలో జి రాయితీ భూములు 14,932, డీ–ఫాం భూములు 5,510 ఎకరాలు, మిగిలిన ప్రభుత్వ భూమి 56,696 ఎకరాలుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) కొల్లేరు ప్రభుత్వ భూమిలో ఎలాంటి సాగు చేసినా నివేదిక అందించాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉంటూ కొల్లేరు గ్రామాల్లో భూముల కోసం నిరసనలకు ఉసిగొల్పుతున్నారు.
జిల్లాలోని నిడమర్రు, భీమడోలు, మొండికోడు, గుండుగొలను, ఆగడాలలంకల్లో కొల్లేరు అభయారణ్య ప్రాంతాల్లో దాదాపు 5,500 ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ పద్ధతి 2006 నుంచి కొనసాగుతోంది. పొలాల్లో ఎరువుల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, గతంలో కోర్టుకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల సుప్రీం ఆదేశాలతో ఇకపై కొల్లేరులో దాళ్వా సాగు చేయవద్దని అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను, తోకలపల్లి, భైనేపల్లి, ఆముదాపల్లి, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, రామన్నగూడెంకు చెందిన ప్రజలు కొల్లేరు ప్రభుత్వ భూముల్లో సుమారు 1,680 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామాలకు చెందిన 400 మంది పొలాలకు వెళ్ళడానికి మంగళవారం ప్రయత్నిస్తే భీమడోలు మండలం సాయన్నపాలెం వద్ద అటవీ సిబ్బంది నచ్చచెప్పి వెనక్కి పంపారు.
నీటి మూటలుగా నాయకుల హామీలు
ఎన్నికల ముందు కొల్లేరు గ్రామాల ఓట్ల కోసం నాయకులు హామీలు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2 పార్లమెంటు, 4 అసెంబ్లీ స్థానాల్లో కొల్లేరు పరిధి ఉంది. జిల్లాలో కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, పశ్చిమగోదావరిలో కె.రఘురామకృంరాజు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీలు పుట్టా మహేష్‌కుమార్ యాదవ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉందని కొల్లేరు సమస్యలు పరిష్కారమవుతాయని కామినేని శ్రీనివాస్ ప్రతిచోట మాటలు చెబుతూ కాలం గడిపారు.
అటవీశాఖలో అలజడి
ఈ నెల 13న కలెక్టరేట్‌లో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ పీవీ.చలపతిరావు సమీక్షా నిర్వహించినప్పుడు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కొల్లేరు రైతులను తీసుకొచ్చి వ్యవసాయానికి అనుమతులు కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా పరిణామాల క్రమంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి ఉంగుటూరులో పర్యటనున్నారు. కొల్లేరు వాసులు సీఎంను కలిసి విన్నవించే దిశగా అడుగులు వేస్తున్నారు.


