ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు
ఏలూరు రూరల్ : ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మంగళవారం దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మానసిక, శారీరక దివ్యాంగులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్, రన్నింగ్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కేరమ్స్, చెస్ తదితర అంశాల్లో దివ్యాంగులు పోటీ పడ్డారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. పోటీల ప్రారంభోత్సవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దివ్యాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్‌తో పాటు ఇడా చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా ఏలూరులో దివ్యాంగులకు కోసం కమ్యునిటీహాలు నిర్మించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వీరభద్రరావు (వాసు) ఎమ్మెల్యేను కోరారు. ఇటీవల రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన దివ్యాంగుడు మన్విత్‌ను నిర్వాహకులు సన్మానించారు. హనుమాన్ జంక్షన్, కై కులూరు, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలకు చెందిన పలు స్వచ్చంద సంస్థలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నూజివీడు: పట్టణంలోని త్రివిధ హైస్కూల్ విద్యార్థి నాగళ్ల వివేక్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సబ్బినేని శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఇటీవల కర్నూల్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని వివేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా వివేక్‌ను ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
ముదినేపల్లి రూరల్: అల్లూరు హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి ప్రమోదిని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శొంఠి రామోజీ తెలిపారు. ఇటీవల మచిలీపట్నం నోబుల్ కళాశాలలో జరిగిన అండర్–14 ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రమోదినిని ఎస్‌ఎంసీ చైర్మన్ ఎస్ వెంకటశ్యామల, కమిటీ సభ్యులు దావు నాగరాజు, వి రత్నకామేశ్వరరావు, హెచ్‌ఎం. ఉపాధ్యాయులు సత్కరించారు.
ముసునూరు: అక్కిరెడ్డిగూడెంలో తాళాలు వేసి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.60 వేల నగదు, 11 కాసుల బంగారం అపహరించుకు పోయిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కిరెడ్డిగూడెంలో పైడిపాముల ఎబినేజర్, సుందర్‌సింగ్ అన్న దమ్ములు. వీరి కుటుంబ సభ్యులందరూ ఇంటి ఎదురుగా ఉన్న చర్చిలో సోమవారం రాత్రి ప్రార్థనలకు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి ప్రవేశించి, బీరువాలు పగలగొట్టి, చోరీకి పాల్పడ్డారు. ప్రార్థనలు ముగించుకుని, యజమానులు ఇంట్లోకి వస్తుండడం చూసి, ఇంటి వెనుక నుంచి పారి పోయారు. ఇంట్లోకి చేరుకున్న యజమానులు బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి, ముసునూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై ఎంకే.బేగ్, చాట్రాయి ఎస్సై రామకృష్ణ జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, ఆధారాలు సేకరించారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు
ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు
ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు


