వేట సాగక.. పూట గడవక
● వరుస తుపాన్లతో సముద్రంలో సాగని వేట
● సీజన్‌లోనూ పస్తులు తప్పడం లేదనిమత్స్యకారుల ఆవేదన
నరసాపురం: ప్రస్తుతం సముద్రంలో మత్స్యసంపద అధికంగా దొరికే కాలం. సముద్రంలో బోట్లపై వేటకు వెళ్లే మత్స్యకారులకు చేతినిండా పని, జేబులు నిండా డబ్బులతో కళకళలాడే సమయం. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో సీజన్‌లోనూ మత్స్యకారులు పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వరుస తుపాన్లు, అల్పపీడనాలతో తీరంలో బోట్లకు లంగరు వేసి, ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి.
వెంటాడుతున్న తుపాన్లు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకూ 61 రోజులపాటు సముద్రంలో వేటనిషేధం అమలు చేస్తుంది. సముద్రంలో చేపల పునర్పుత్తి సీజన్ కావడంతో, మత్స్యసంపద అంతరించిపోకూడదనే ఉద్దేశ్యంతో వేట నిషేధం అమలు చేస్తారు. ఈ ఏడాది జూన్‌లో వేట ప్రారంభమైన నాటి నుంచి మత్స్యకారులకు ప్రకృతి సహకరించడం లేదు. జూలై మొదలు వరుస తుపాన్లు వెంటాడుతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా వేట సాగడం లేదు. మొన్న మోంథా తుపానుతో అల్లాడగా ప్రస్తుతం మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాను హెచ్చరికలు వాతావరణశాఖ నుంచి వెలువడడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వేట నిషేధం ముగిసిన తరువాత సముద్రంలో చేపలు పెద్దసంఖ్యలో వలలకు చిక్కుతాయి. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టి సముద్రంలోకి వేటకు వెళతారు. తీరా వేటకు వెళ్లిన బోట్లు తుపాను హెచ్చరికలతో తీరానికి ఖాళీగా వస్తే అంతా నష్టమే మిగులుతుంది. ప్రస్తుతం మత్స్యకారులు అలాంటి నష్టాలే చూస్తున్నారు.
ఇదే అసలైన సీజన్..
ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది. సముద్ర తీరంపై మంచుతెరల కారణంగా చల్లని వాతారణం, తరువాత సూర్యోదయం నుంచి ఎండ తీవ్రత కారణంగా అధిక ఉఫ్ణోగ్రతతో వతీరం వాతావరణ వేడెక్కడం.. లాంటి వాతావరణంతో సముద్రం లోపలిభాగం నుంచి చేపలు, రొయ్యిలు పైకి వచ్చి వలలకు చిక్కుతాయి. ఈ రకమైన వాతావరణంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుందని, అందుకే నవంబర్, డిసెంబర్ మాసాల్లో ముమ్మరంగా వేట సాగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే వరస తుపాణ్లు మత్స్యకారుల ఉపాధిని దెబ్బకొడుతున్నాయి.
ఏదీ సందడి..
నరసాపురం తీరంలో వివిధ జిల్లాలకు చెందిన బోట్లు వేట సాగిస్తాయి. బంగాళాఖాతానికి కీలకమైన ప్రాంతం కావడం, గోదావరి, సముద్ర సంగమ ప్రాంతం కావడంతో ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరుకుతుంది. దీంతో నరసాపురంతో పాటుగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్టణం, శ్రీకాకుళం., కృష్ణా జిల్లాకు చెందిన సుమారు 150 వరకూ మెకనైజ్డ్ బోట్లు నరసాపురం తీరంలో వేట సాగిస్తాయి. ఏటా రూ.400 కోట్ల మత్స్యసంపద ఇక్కడి నుంచి ఎగుమతి జరుగుతుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకూ ముమ్మరవేటతో సందడిగా ఉండే నరసాపురం తీరంలో వరుస ప్రకృతి విపత్తులు నడ్డివిరిచాయి.
ఆదుకోని ప్రభుత్వం
ఈ ఏడాది వేట ప్రారంభమై 160 రోజులు గడిచిని తుపాన్ల దెబ్బకి దాదాపు 40 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉన్నారు. దీంతో గంగపుత్రులు అప్పులు చేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి. గత జగన్ ప్రభుత్వం వేట నిషేధం సమయంలో జిల్లాలో 5 ఏళ్లలో 6,427 మందికి రూ.7.87 కోట్లు మత్స్యకార భరోసా సాయం అందించింది. చంద్రబాబు సర్కారు మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచినా, అర్హులందరకి అందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువ రోజులు వేట లేకుండా ఖాళీగా ఉన్న మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం ఏవిధమైన సాయం అందించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


