రోడ్డు ప్రమాదంలో పొగాకు రైతు మృతి
జంగారెడ్డిగూడెం: వేగవరం సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్జీనియా పొగాకు రైతు మృతి చెందాడు. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన మువ్వ సాంబశివరావు (57) జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రానికి వచ్చారు. వేలం కేంద్రంలో పనులు ముగించుకుని తిరిగి ఇంటికి కలపాల రాజు అనే వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో రామాయణం బ్రహ్మం అనే వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వేగవరం పుంత రోడ్డు నుంచి వస్తూ వీరి మోటార్‌సైకిల్‌ను, సమీపంలో ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సాంబశివరావుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాంబశివరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో సాంబశివరావు మోటార్‌సైకిల్‌పై వెనుక కూర్చొన్న కలపాల రాజుతో పాటు మరో మోటార్‌సైక్లిస్టు రామాయణం బ్రహ్మంకు గాయాలయ్యాయి. వీరిద్దరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మృతిచెందిన సాంబశివరావుకు భార్య మణికుమారి, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బుట్టాయగూడెం: శ్రీకాకుళం నుంచి తెలంగాణవైపు గోవులను అక్రమంగా తరలిస్తున్న లారీని మంగళవారం జీలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్‌ను విచారించగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 50 ఎద్దులు, 15 ఆవులు మొత్తం 65 పశువులను అధిక ధరలకు కబేళాలకు అమ్మేందుకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. వీఆర్‌ఓ ఫిర్యాదుతో లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చామని, గోవులను గోశాలకు తరలించామని చెప్పారు.


