బడా కార్పొరేట్ల కోసమే విత్తన చట్టం
ఏలూరు (టూటౌన్): బడా కార్పొరేట్ విత్తన కంపెనీల లాభాల కోసమే కేంద్ర ప్రభుత్వం ‘2025 విత్తన చట్టం’ ముసాయిదా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుత ముసాయిదాలో సెక్షన్ 16(3) ప్రకారం విత్తనాలను వాణిజ్యపరంగా రైతులకు విడుదల చేయటానికి దేశంలోనూ, ఇతర దేశాలలోనూ పరిశోధనలు చేయవచ్చని చెప్పిందన్నారు. కానీ విదేశీ వాతావరణంలో జరిగిన ప్రయోగాలు ఉపయోగపడవు అని చెప్పారు. గతంలో బీటీ విత్తనాల వలన రైతులు నష్టపోయారని, తిరిగి విదేశీ టెక్నాలజీకే అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. కంపెనీలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేస్తే లైసెన్సులు రద్దు చేయటం, జైలు శిక్షలు విధించటం లాంటి పెనాల్టీలు ముసాయిదాలో లేకపోవడం వలన రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. విత్తన నాణ్యతపై, జెర్మినేషన్ పై స్పష్టత ఉండాలన్నారు. రాష్ట్రాల స్థాయిలో నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి విత్తన చట్ట ముసాయిదాను రూపొందించాలని కోరారు. నూతన విత్తన చట్టం ద్వారా రైతులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీనివాస్ కోరారు.
ఏలూరు(మెట్రో): ధాన్యం సేకరణలో రైతులు ఎదుర్కునే సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలో రికార్డు స్థాయిలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాధ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో టాయిలెట్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై విద్యా శాఖాధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. తణుకు వద్ద పశు మాంస కబేళాలు నిర్వహిస్తున్నారని, దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దెందులూరు: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని దెందులూరు పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి తోకలపల్లి వెళ్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాన్ని దెందులూరు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున సీజ్ చేశారు. వాహన యజమాని పవన్ కుమార్, డ్రైవర్ సాంబశివరావుతో పాటు తోకలపల్లికి చెందిన చేపల చెరువు రైతు, హైదరాబాదులోని సరఫరాదారుడు పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు.
బడా కార్పొరేట్ల కోసమే విత్తన చట్టం


