నడక దారిలో నరకయాతన
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు కాలినడక మార్గాల్లో నరక యాతన అనుభవిస్తున్నారు. వీధి లైట్లు, మరుగుదొడ్లు, విశ్రాంతి పొందేందుకు కనీసం షెల్టర్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. దాంతో మా కష్టాలు చూడవయ్యా.. అంటూ ఆ గోవిందుడికి మొర పెట్టుకుంటున్నారు. ద్వారకాతిరుమల దివ్య క్షేత్రానికి కాలినడక భక్తుల సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 2 వేల మంది వరకు భక్తులు పాదయాత్రగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వారంతా దేవస్థానం నిత్యాన్నదాన భవనంలో స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించి, డార్మెటరీల్లో, ఆలయ పరిసరాల్లో విశ్రాంతి పొందుతున్నారు. శనివారం ఉదయాన్నే శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శనివారం సైతం అధిక సంఖ్యలోనే భక్తులు కాలినడకన క్షేత్రానికి వస్తున్నారు. ప్రస్తుతం కార్తీకమాస పర్వదినాల్లో ఒక్క శుక్రవారం నాడే 4 వేల మందికి పైగా భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్నారు. రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం, దేవరపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా క్షేత్రానికి వస్తున్నారు. కృష్ణాజిల్లా, ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భీమడోలు, తడికలపూడి మీదుగా, అదేవిధంగా ఖమ్మం, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులు కామవరపుకోట మీదుగా క్షేత్రానికి చేరుకుంటున్నారు.
చిమ్మ చీకట్లో.. సెల్‌ఫోన్ వెలుగుల్లో
ఎక్కువగా భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా, ఆ తరువాత భీమడోలు మీదుగా క్షేత్రానికి వస్తున్నారు. ఈ మార్గాల్లో లైట్లు లేకపోవడంతో చిమ్మ చీకట్లోనే తమ పాదయాత్రను సాగిస్తున్నారు. కొందరు ఇళ్ల వద్ద నుంచి టార్చ్ లైట్లు వెంటబెట్టుకొస్తుంటే, మరికొందరు సెల్‌ఫోన్ వెలుగుల్లో నడుస్తున్నారు. విష సర్పాల మధ్య నుంచి తమ యాత్ర సాగుతోందని భక్తులు వాపోతున్నారు. కొందరు కర్రలు పట్టుకుని నడుస్తున్నారు. రాళ్లకుంట మార్గంలో విద్యుత్ స్తంభాలకు పైపులు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ఒక్క లైటు కూడా అమర్చలేదు. మధ్యలో మరుగుదొడ్లు లేక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడిచే సమయంలో అలసట వస్తే విశ్రాంతి పొందేందుకు షెల్టర్లు లేక రోడ్లపైనే కూర్చుంటున్నారు. రాళ్లకుంట గ్రామంలో కొన్నేళ్ల క్రితం దాతలు నిర్మించిన షెల్టర్ ఒక్కటే భక్తులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది.
కోతలతోనే సరి
కొందరు ప్రజాప్రతినిధులకు రాజకీయంగా వాడుకోవడానికి క్షేత్రం పేరు బాగా ఉపయోగపడుతోంది. భక్తులకు అదిచేస్తాం.. ఇది చేస్తామని కోతలు కోస్తున్న పాలకులు కనీసం కాలినడక మార్గాల్లో వీధిలైట్లు కూడా వెలిగించలేక పోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. పాదయాత్ర మార్గాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు తమ పంచాయతీ శివార్ల వరకు వీధి లైట్లు వెలిగించగలిగితే సమస్య కాస్త తీరుతుంది. ఈ విధానాన్ని అమలు పరిచేవారు ఎవరన్నది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలని పాదయాత్ర భక్తులు కోరుతున్నారు.
కాలినడక మార్గాల్లో శ్రీవారి భక్తుల అవస్థలు
వీధి లైట్లు, మరుగుదొడ్లు, షెల్టర్లు లేక ఇక్కట్లు
చీకట్లో విషసర్పాల మధ్య నుంచి క్షేత్రానికి చేరుకుంటున్న భక్తులు
కనీస సౌకర్యాలు కల్పించాలంటూ భక్తుల మొర
నడక దారిలో నరకయాతన
నడక దారిలో నరకయాతన


