న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్ల కుదింపు
విడుదలైన ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితా
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)తో ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్‌డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత
ఉమ్మడి వరంగల్‌లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్ పశ్చిమది. జూన్ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు.
ఏఎస్‌డీడీలో పాలకుర్తి రెండో స్థానం..
ఏఎస్‌డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్‌లో రెండో స్థానం, వరంగల్ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్‌డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది.
అక్టోబర్ 1న తుది జాబితా..
ఇక నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్‌లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది.
రంగంలోకి రాజకీయ పార్టీలు
మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్‌డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్ మేనేజ్‌మెంట్‌కు కీలకమైన ప్రక్రియగా మారనుంది.
12 నియోజకవర్గాల్లో 4.84 లక్షల మంది ఏఎస్‌డీడీలో..
1.62 లక్షల మందికి నో మ్యాపింగ్
17.08.26
నాటికి ఓటర్లు
26,77,498
ఏఎస్‌డీడీ
4,83,803
తగ్గిన ఓటర్లు
3,75,740


