గోపాల్‌పేట: రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని.. రాబోయే మూడేళ్లలో ఇళ్లు నిర్మించి తీరుతామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ అయేషా అంజుం అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. మొదట అధికారులతో శాఖల వారీగా పురోగతి అడిగి తెలుసుకొన్నారు. ఎన్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు మెట్టపంటల సాగుపై దృష్టి సారించాలని, వరి తక్కువగా సాగు చేయాలని.. ఒకవేళ వరి సాగు చేసినా సన్నరకం మేలని వ్యవసాయ అధికారి రమేష్ వివరించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సర్పంచ్‌లను అడిగారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత గ్రామపంచాయతీలకు బిల్లులు కావడం లేదని చెప్పడంతో ఎందుకు పని సరిగా చేయడం లేదని ఎంపీఓ భవాని, కంప్యూటర్ ఆపరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీరు వారానికి ఒకసారి వస్తున్నాయని లక్ష్మీతండా సర్పంచ్ చెప్పడంతో ఇదేమిటని అధికారులను నిలదీశారు. ఎస్‌ఐఆర్ 99 శాతం పూర్తి చేసినందుకుగాను అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. విద్య విషయంలో ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కె వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లోడె రఘు, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.


