కలెక్టర్ సమీక్ష..
జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద నీరు కొనసాగుతుండడంతో కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టుకు ఎంతమేర వరద వచ్చింది.. కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వరద నీటి స్థితిగతులు వంటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, గేట్ల పనితీరు, హైడల్ పవర్ హౌజ్‌లో విద్యుదుత్పత్తి వంటి వివరాలపై ఆరాతీశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో లైనింగ్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జూరాల– ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు నీటి విడుదల వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పండించే రైతులు పంటకాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెరువులను కృష్ణాజలాలతో నింపుకోవాలని సూచించారు. అదేవిధంగా జూరాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎస్‌ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ నందిని తదితరులున్నారు.
గద్వాల: వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా వరద నీరు లేక ఒట్టిపోయిన జూరాల జలాశయం.. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో జలకళ సంతరించుకుంది. ఈ వానాకాలం సీజన్‌లో గరిష్టంగా మంగళవారం 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జూరాలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు భారీగా వరద కొనసాగుతుండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తాజాగా పూర్తిస్థాయి పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ జూరాలను సందర్శించి వరద నీటి వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించారు.
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని..
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలుగొందుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వల పరిధిలో 1.09 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో దాదాపు నెలన్నర రోజులపాటు వర్షాలు కురవక.. కృష్ణానదిలో నీరు పారక జూరాల ప్రాజెక్టు అడుగంటింది. దీంతో అధికారులు జలాశయంలో అందుబాటులో ఉన్ననీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు కింద ఉన్న ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ, జూరాల కింద అప్పటికే సుమా రు 60 వేలకుపైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రై తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కృష్ణాబేసిన్ పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షా లు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వర ద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రైతన్నకు తీపికబురు.. స్థానికంగా పెద్దగా వానలు కురవకపోయినా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా వరద జలాల రాక స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి రిజర్వాయర్లకు ఎత్తిపోతలు చేపట్టారు. ఆయకట్టులోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇన్నాళ్లు ఎల్‌నినో ప్రభావంతో వరి వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
కృష్ణానదికి పోటెత్తుతున్న భారీ వరద
గడిచిన వారం రోజులుగా జూరాల స్థిరంగా ప్రవాహం
జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలకు నిర్ణయం
నెట్టెంపాడు, ఆర్డీఎస్, జూరాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాలు
అన్నదాతల హర్షం.. సాగు పనుల్లో నిమగ్నం


