వనపర్తి/వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫాంల కుట్టు పనులు నాణ్యతగా, వేగంగా పూర్తిచేసి నిర్దేశిత గడువులోగా అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. వనపర్తి పురపాలికలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు కేంద్రంతో పాటు మండలంలోని రాజపేటలో సెర్ఫ్ కుట్టుకేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. ప్రతి యూనిఫాంను నిర్ణీత ప్రమాణాల మేరకు కుట్టి ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. కుట్టు పనులు ఆగస్టు 10వ తేదీలోగా పూర్తిచేసి సకాలంలో సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట పుర కమిషనర్ నిరంజన్, డీపీఎం, మెప్మా, సెర్ప్ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు.


