‘అమరచింత’ ఆయకట్టుకు అందని సాగునీరు
అమరచింత: వేసవిలో చేపట్టాల్సిన ఎత్తిపోతల సెక్షన్ పైపుల మరమ్మతు ప్రస్తుత వానాకాలంలో కొనసాగుతున్నాయి. కృష్ణానదికి వరద వచ్చి జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి పారుతుంటే సమీపంలోనే ఉన్న అమరచింత ఎత్తిపోతల ఆయకట్టు రైతులు మాత్రం సాగునీరు వినియోగించుకోలేకపోతున్నారు. సెక్షక్షన్ పైపుల మరమ్మతు పూర్తయితే తప్పా లిఫ్ట్‌కు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వరి నారుమడులు సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో వారం పాటు మరమ్మతులు కొనసాగుతాయని.. పూర్తయిన వెంటనే ఆయకట్టుకు నీటిని అందిస్తామని లిఫ్ట్ నిర్వహణ కమిటీ చెబుతోంది. ఇప్పటికే సాగునీరు వదలాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తున్నా.. 26 ఏళ్ల కిందట ఏర్పాటు చేసుకున్న సెక్షన్ పైపులను మార్చి కొత్త పైపులను అమర్చుకునే పనులు కొనసాగుతుండటంతో రైతుల విజ్ఞప్తిని వింటూనే త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి హయంలో నాబార్డు నుంచి రూ.11 కోట్లతో 2,400 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అమరచింత ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. లిఫ్ట్ డ్రమ్ము మరమ్మతుకు గురికావడంతో తెలంగాణా ఉద్యమ సమయంలో లిఫ్ట్ సందర్శనకు వచ్చిన నాటి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎంపీ నిధుల నుంచి రూ.60 లక్షలు మంజూరు చేయించారు. చిన్న చిన్న మరమ్మతులతో సాగునీటిని అందించిన ఎత్తిపోతలకు ప్రస్తుతం అతిపెద్ద మరమ్మతు సెక్షన్ పైపులను మార్చడమేనని ఆయకట్టు రైతులు అంటున్నారు.
యాసంగిలో క్రాప్‌హాలిడే..
అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు రెండేళ్లుగా యాసంగి సీజన్‌లో సాగునీరు సరఫరా చేయక క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈసారైనా వానాకాలంలో సకాలంలో వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలకు ఎదురుచూపులే మిగిలాయి.
వరద వేళ కొనసాగుతున్న సెక్షన్ పైపుల మరమ్మతు
గతేడాదే రూ.56 లక్షలు మంజూరు
టెండర్ పూర్తయినా.. అగ్రిమెంట్ ఆలస్యం
సాగునీటికి ఆయకట్టు రైతుల ఎదురుచూపులు


