మదనాపురం: శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన ప్రతి బిడ్డకు 30 నిముషాల నుంచి గంటలోపు ముర్రుపాలు పట్టించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండలంలోని తిరుమలాయపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శిశువుకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు. బాలింతలు తమ రోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తి జరుగుతుందని సూచించారు. అంగన్‌న్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీపీఓ రాజలక్ష్మి, సూపర్‌వైజర్ జ్యోతి, ఉపాధ్యాయులు రాధ, శారద, అరుణ, తారమ్మ, హంసమ్మ, సుజాత, ఎంఎల్‌టీలు రతన్, ముజాఫర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


