టెక్నికల్‌గా తగ్గించారా..! | - | Sakshi
Sakshi News home page

టెక్నికల్‌గా తగ్గించారా..!

Aug 4 2026 12:35 AM | Updated on Aug 4 2026 12:35 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎమ్మార్‌) పెట్టని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ అస్త్రం ప్రయోగించగా.. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్తకోణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పలువురు జిల్లా స్థాయి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్‌ సప్లయ్‌ శాఖ వర్గాలతో పాటు రైస్‌ మిల్లర్లలో ఈ చర్చ జోరుగా సాగుతుండగా.. కలకలం సృష్టిస్తోంది.

అసలేం జరిగింది..

రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. మిల్లర్లు బకాయి పడిన మొత్తం చెల్లించాలని ప్రభుత్వ ఇటీవల అల్టిమేటం జారీ చేసింది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో విజిలెన్స్‌ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హైదరాబాద్‌ సిటీ యూనిట్‌–2, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా గత నెల 29న రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గుబ్బా అశోక్‌కు చెందిన ఇబ్రహీంబాద్‌లోని రైస్‌ మిల్లులో సోదాలు నిర్వహించారు. 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మెట్రిక్‌ టన్నుల (1,26,772 బస్తాలు) ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్‌ ధాన్యాన్ని అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను సైతం సీజ్‌ చేశారు.

లోపాయికారిగా సర్దుబాటు?

మిల్లుల్లో భారీగా ఉండాల్సిన ధాన్యం కొరతను సిబ్బంది నామమాత్రంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 లక్షల బస్తాలు లేకున్నా.. కేవలం 1,26,772 బస్తాలు మాయమైనట్లు తేల్చడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కించిన సిబ్బందికి ఆ మిల్లర్‌తో గత పరిచయాలు ఉన్నాయని.. ఈ మేరకు సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఓ అధికారి చక్రం తిప్పి తక్కువ బస్తాలు చూపించేలా సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

విచారణ జరిపిస్తేనే వెలుగులోకి..

శ్రీబాలాజీ మిల్లుకు సంబంధించి 2022–23 రబీ సీజన్‌ బకాయిలు సుమారు రూ.19.50 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.2.60 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్‌ అధికారులు మా సమ్మతి లేకుండానే సుమారు లక్ష ఇరవై వేల బస్తాలు లేవని ప్రెస్‌కు రిలీజ్‌ చేశారని సదరు మిల్లు నిర్వాహకుడు మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే.. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పలువురు అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. విచారణ జరిపినా ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై ఉన్నతాధికారులు జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ సిబ్బందికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం.

రైస్‌ మిల్లర్లలో ముదిరిన పోరు..

తనిఖీలు నిర్వహించిన మిల్లుకు సంబంధించిన నిర్వాహకుడు ప్రస్తుతం మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2022–23 రబీకి సంబంధించిన సీఎమ్మార్‌ ధాన్యం అంశంపై ఆయన కొంత మంది మిల్లర్లతో కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని.. విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టిందని.. సయోధ్యతో పోతే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవని జిల్లాలోని పలువురు మిల్లర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఆయన నోటి దురుసుతో మాట్లాడడమే చేటు తెచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రైస్‌ మిల్లర్లలో పోరు ముదురుతున్నట్లు తెలుస్తోంది.

లెక్కింపు

సమయంలోనే..

రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ బృందం తనిఖీల సందర్భంగా జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవడం సహజం. ఈ మేరకు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గణేష్‌ తదితర అధికారులు చేరుకుని ఇబ్రహీంబాద్‌లోని శ్రీ బాలాజీ మిల్లులో ఉన్న వడ్ల బస్తాల లెక్కింపు కోసం ఇద్దరు జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ మేరకు సదరు సిబ్బంది వడ్ల బస్తాల నిల్వలను గడ (స్టాక్‌) ఆధారిత భౌతిక లెక్కింపు (ఫిజికల్‌ వెరిఫికేషన్‌) విధానంలో లెక్కగట్టారు. గోదాంలో వడ్ల బస్తాలను చట్రంలా ఒక పద్ధతి ప్రకారం అమర్చిన మేర పొడవు, వెడల్పు, ఎత్తులను కొలిచి మిల్లులో ఉన్న బస్తాల సంఖ్యను తేల్చారు. గోనె సంచుల్లో బరువు ఆధారంగా ఎన్ని మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందనేది నిర్ధారించారు. అయితే ఇక్కడే మాయాజాలం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘శ్రీ లక్ష్మీ బాలాజీ’లో విజిలెన్స్‌ తనిఖీల్లో కొత్తకోణం

వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం

పౌరసరఫరాల శాఖ సిబ్బందిపై అనుమానాలు

లోపాయికారి ఒప్పందంలో ఓ అధికారి హస్తం?

సివిల్‌ సప్లయ్‌ డీఎస్‌ఓ, డీఎం మధ్య పంచనామా లొల్లి

రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌లో

ముదురుతున్న పోరు

ఇరువురి మధ్య ‘పంచనామా’ లొల్లి..

నిబంధనల ప్రకారం వడ్ల బస్తాల లెక్కింపు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే స్థల పంచనామా రికార్డులు రాస్తారు. బస్తాలు లెక్కించిన వివరాలు, కేటాయింపులతో పోలుస్తూ వ్యత్యాసాలు స్పష్టంగా నమోదు చేస్తారు. ఆ తర్వాత తనిఖీ చేసిన అధికారులు, మిల్లు యజమాని లేదంటే సదరు మిల్లు ప్రతినిధి, సాక్షులు (రెవెన్యూ, సివిల్‌ సప్లయ్‌ సిబ్బంది) సంతకాలు తీసుకుంటారు. ఇక్కడ సివిల్‌ సప్లయి డీఎస్‌ఓ గంప శ్రీనివాస్‌ మిల్లు యజమాని లేదా సదరు మిల్లు ప్రతినిధి సంతకం లేకుండానే రిపోర్ట్‌ను జిల్లా మేనేజర్‌ రవినాయక్‌కు పంపించినట్లు సమాచారం. దీన్ని డీఎం ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోసం డీఎస్‌ఓతో ఫోన్‌లో మాట్లాడేందుకు ‘సాక్షి’ సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. ఆ శాఖలోని మరో అధికారిని సంప్రదిస్తే.. మిల్లు యజమాని లేదా ప్రతినిధి సంతకాలు అవసరం లేదని, విజిలెన్స్‌ అధికారులకు ఒక కాపీ ముందుగానే అందజేస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement